ఆస్కార్ గట్టు మీద తెలుగు పాట పోట్ల గిత్తలా రంకెలేసింది
అమ్మోరు ఆవహించిన పోతరాజులా వీరంగమాడింది
మిరపతొక్కు ఘాటులో రగతమంతా రగిలి కర్రసాము చేసింది
పదం పదం కలిపి భూమిదద్దరిల్లేలా సిందులు తొక్కి దుమ్మారం రేపింది. భరతజాతి గుండెలు పులకించేలా దండనకర మోగించింది. విశ్వసినీ వేదికపై తెలుగు పాటకు పట్టాభిషేకం జరిగింది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకొని భారతీయ సినిమాలో నవ చరితకు నాంది పలికింది.
కోట్లాది భారతీయుల ఎన్నో ఏండ్ల ఎదురుచూపులు ఫలించాయి. తొలిసారి భారతీయ గీతం ఆస్కార్ యవనికపై జయకేతనాన్ని ఎగరేసింది. భారతీయ సినిమాకిది నవోదయం. సరికొత్త వెలుగులకు నాంది ప్రస్థానం. తెలుగు పాటకు ప్రపంచ సినీ వేదిక నీరాజనాలు పలికిన శుభ తరుణం. ఈ చారిత్రక ఘట్టానికి కరతాళ ధ్వనులతో సాక్షిగా నిలిచింది లాస్ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్ ప్రాంగణం.
95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం అమెరికా లాస్ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో తారల తళుకుబెళుకుల నడుమ అట్టహాసంగా జరిగింది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమాతో పాటు ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారతీయ డాక్యుమెంటరీ ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ చిత్రానికి సైతం ఆస్కార్ వరించింది. ఈ ఏడాది రెండు పురస్కారాలతో ఆస్కార్ వేదికపై భారతీయ సినిమా సత్తా చాటింది. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఎట్ వన్స్’ చిత్రం ఉత్తమ చిత్రంతో పాటు మొత్తం ఏడు అవార్డులతో ఈ ఏడాది ఆస్కార్ పురస్కారాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ‘నాటు నాటు’ పాటకు స్వరకర్త కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ ఆస్కార్ పురస్కారాన్ని స్వీకరించారు. వేదికపై గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ లైవ్ పర్ఫార్మెన్స్కు స్టాండింగ్ ఒవేషన్ దక్కింది.
‘ఇంకా ఎన్నాళ్లీ నక్కల వేట..కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి’… కొమరం భీమ్‌తో అల్లూరి పలికిన సంభాషణ చందంగా ప్రపంచ సినీ అవార్డుల కుంభస్థలం లాంటి ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ సత్తా చాటింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో పోటీపడిన ‘అప్లాజ్’ (టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్), ‘లిఫ్ట్ మి అప్’ (బ్లాక్ పాంథర్: వకాండా ఫెరవర్), దిస్ ఈజ్ ఎ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్), ‘హోల్డ్ మై హ్యాండ్’ (‘టాప్‌గన్ మావెరిక్’) పాటలను అధిగమించి ‘నాటు నాటు’ ఆస్కార్‌ను కైవసం చేసుకుంది. ‘డు యూ నో నాటు’ అంటూ ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాటను పరిచయం చేస్తూ అగ్ర కథానాయిక దీపికా పడుకోన్ చెప్పిన మాటలతో డాల్బీ థియేటర్ ప్రాంగణం దద్దరిల్లిపోయింది. ‘ఈ పాట విశ్వ సంచలనం. మంత్రముగ్ధం చేసే స్టెప్పులు, హుషారెత్తించే బీట్ ఈ పాటకు గొప్ప అందాన్ని తీసుకొచ్చాయి. భారతీయ స్వాతంత్య్ర పోరాట విప్లవ కారులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ మధ్య స్నేహానుబంధాన్ని తెలియజెప్పే సందర్భంలో వచ్చే పాట ఇది. సోషల్‌మీడియాలో కోట్లాది వీక్షణలు సొంతం చేసుకుంది. భారతీయ సినిమా నుంచి తొలిసారి ఆస్కార్‌కు నామినేట్ అయిన గీతమిది’ అంటూ పాట గురించి దీపికా పడుకోన్ అక్కడి ఆహుతులకు వివరించింది. అనంతరం గాయకులు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ లైవ్‌లో ఈ పాటను ఆలపించారు. ఈ లైవ్ పర్ఫార్మెన్స్ ఈవెంట్ మొత్తానికే ప్రధానాకర్షణగా నిలిచింది. ‘నాటు నాటు’ పాటకు అవార్డు ప్రకటించగానే దర్శకుడు రాజమౌళి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. భావోద్వేగంలో పక్కనే ఉన్న తన సతీమణి రమా రాజమౌళిని ఆప్యాయంగా హత్తుకొని ఆనందాన్ని చాటుకున్నారు.
‘నాటు నాటు’ పాట వెనక కథ..
బ్రిటీష్ వారి సల్సా నృత్యాన్ని సవాలు చేస్తూ కథానాయకులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు భారతీయ పాట ఔన్నత్యాన్ని ప్రదర్శించే సందర్భంలో వచ్చే పాట ఇది. అందుకే ఈ పాట మిగతా పాటలకంటే ఉన్నతంగా ఉండాలని దర్శకుడు రాజమౌళి భావించారు. కీరవాణి హుషారైన మాస్ బీట్‌కు అనుగుణంగా చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యాన్నందించారు. సాధారణ పదాల్లోనే గంభీరమైన భావాల్ని పలికించారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ తమ గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. ప్రేమ్క్ష్రిత్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. ఈ పాటను ఉక్రెయిన్‌లో అధ్యక్షుడి భవనం ముందు చిత్రీకరించడం ప్రధానాకర్షణగా నిలిచింది. ‘నాటు నాటు’ పాటలోని హుక్ స్టెప్కోసం దాదాపు 80పైగా వెరైటీలతో కూడిన స్టెప్స్‌ను కంపోజ్ చేశారు నృత్య దర్శకుడు. ముఖ్యంగా డ్యాన్సులో ఇద్దరి మధ్య సింక్ కోసం చాలా శ్రమపడ్డారు. డ్యాన్స్‌లోని సింక్ కోసమే రామ్‌చరణ్, ఎన్టీఆర్ 18 టేక్‌లు తీసుకున్నారు. చివరకు పర్ఫెక్ట్గా సింక్ కుదిరిన తర్వాతే పాటను ఓకే చేశారు.
సమాంతర ప్రపంచాల కథ…
సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తీసిన అబ్సర్డిస్ట్ (నైరూప్య) కామెడీ ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ ఆస్కార్ పురస్కారాల్లో అగ్రస్థానంలో నిలిచింది. 11 నామినేషన్లు పొందిన ఈ చిత్రం ఏకంగా 7 అవార్డుల్ని సొంతం చేసుకొని సంచలనం సృష్టించింది. ఈ భూమిపై మనుషులు పోలిన మనుషులు ఉంటారనే ఓ భావన మాదిరిగానే…ఈ అనంత విశ్వంలో కూడా సమాంతర ప్రపంచాలుంటాయని, అక్కడ మనల్ని పోలిన మనుషులతో సంభాషించడం సాధ్యమనే ఉహాత్మక కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎవెలిన్ అనే అమెరికాకు వలస వచ్చిన చైనా మహిళ చుట్టూ నడిచే ఈ కథలో ఈ ప్రపంచం తాలూకు గందరగోళం, అనేకానేక నైరూప్య భావనలతో సాగిపోయే మహిళా జీవితాన్ని వినోదాత్మక కోణంలో ఆవిష్కరించారు. ఉత్తమ చిత్రంతో పాటు, ఉత్తమ దర్శకుడు. ఉత్తమ నటి, ఉత్తమ సహాయనటుడు, నటి, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో ఈ చిత్రం అవార్డుల్ని కైవసం చేసుకుంది. ఈ సినిమా తర్వాత ‘ఆల్ క్వైట్ ఇన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’ సినిమా ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ మ్యూజిక్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో అవార్డుల్ని సొంతం చేసుకొని రెండోస్థానంలో నిలిచింది.
చంద్రబోస్ కసరత్తులు
‘నాటు నాటు’ పాట కోసం గీత రచయిత చంద్రబోస్ పెద్ద కసరత్తే చేశారు. రాజమౌళి సూచనలన్నింటిని పరిగణలోకి తీసుకున్నారు. తెల్లవాళ్లని ఏమాత్రం కించపరచకుండా మన ధైర్యసాహసాలు, ప్రతిభాసంపతుల్ని ఆవిష్కరించేలా పాటలోని భావం ఉండాలని రాజమౌళి సూచించారట. ఈ పాట పూర్తి చేయడానికి చంద్రబోస్ 19 నెలల సమయం తీసుకున్నారు. పాటను ఉక్రెయిన్‌లో చిత్రీకరిస్తున్న సమయంలో కూడా దర్శకుడు రాజమౌళి..చంద్రబోస్‌కు ఫోన్ ద్వారా కొన్ని మార్పులతో లిరిక్స్ రాయాలని సూచించారట. కేవలం పదిహేను నిమిషాల్లోనే పాట చివరి చరణాల్ని మార్చి ఇచ్చారు చంద్రబోస్.
తెలుగువారికి గర్వకారణం
నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం దేశానికి, తెలంగాణకు గర్వకారణం. విశ్వ సినీ యవనికపై తెలుగోడి సత్తా చాటారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్‌ను గెలుచుకోవడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణం. సినీ సంగీత ప్రియులను ఓలలాడించి, కాలు కదిపేలా చేసిన పాటకు ప్రపంచస్థాయి గుర్తింపు రావడం ఆనందంగా ఉన్నది. నాటు నాటు పాటలో పొందు పరిచిన పదాలు.. తెలంగాణ సంస్కృతి, తెలుగు ప్రజల రుచి, అభిరుచి, ప్రజాజీవన వైవిధ్యానికి అద్దం పట్టాయి. తెలుగు భాషలోని మట్టి వాసనలను, ఘాటును, నాటు పాట ద్వారా గొప్పగా వెలుగులోకి తెచ్చిన పాట రచయిత జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగె గ్రామబిడ్డ చంద్రబోస్‌కు అభినందనలు.
– ముఖ్యమంత్రి కేసీఆర్
రంగు మారిన ఆస్కార్ కార్పెట్
ఆస్కార్ వేడుకలో రెడ్‌కార్పెట్ (ఎర్ర తివాచీ) పై నడవటాన్ని గొప్ప గౌరవంగా భావిస్తారు. ఈ కార్పెట్‌పై ప్రత్యేక దుస్తులు ధరించి ఫోజులిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. అయితే ఈ సారి తివాచీ రంగుని ఎరుపు నుంచి షాంపైన్ రంగుకు మార్చారు. 1961 నుంచి వస్తు న్న రెడ్ కార్పెట్ సంప్రదాయానికి ఈసారి బ్రేక్ వేశారు. గత ఏడాది ఆస్కార్ వేడుకలో అగ్ర నటుడు విల్‌స్మిత్..ప్రజెంటర్ క్రిస్రాస్ను చెంపదెబ్బ కొట్టడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో సెంటిమెంట్‌గా భావించి కార్పెట్ రంగును మార్చారని అంటున్నారు. రెడ్ కార్పెట్ రంగు మార్పుపై 95వ ఆస్కార్ వేడులకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన జిమ్మీ కిమ్మెల్ వ్యంగ్యంగా స్పందించారు. ‘గత ఏడాది చోటుచేసుకున్న చెంపదెబ్బ ఘటనతో ఆస్కార్ వేదిక మొత్తం ఎరుపెక్కింది. అందుకే ఈ ఏడాది కాస్త శాంతస్వభావాన్ని సూచించే రంగును ఎంపిక చేసుకున్నారేమో’ అని వ్యాఖ్యానించారు.
‘నాటు నాటు’కు లేడీగాగా ఛీర్స్
ఈ ఆస్కార్ వేడుకలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ‘నాటు నాటు’ పాటకు అవార్డు ప్రకటించగానే హాలీవుడ్ గాయని లేడీ గాగా స్టాండింగ్ ఒవేషన్‌తో ఛీర్స్ చెప్పింది. ‘టాప్ గన్’ చిత్రంలోని ‘హోల్డ్ మై హ్యాండ్’ పాటను ఆమె ఆస్కార్ వేదికపై లైవ్ పర్ఫార్మ్ చేసింది. తన పాట కూడా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో పోటీలో ఉన్నప్పటికీ సహృదయంతో ‘నాటు నాటు’ పాట తాలూకు ఆనందంలో లేడీ గాగా పాలుపంచుకోవడం విశేషం. ఈ సందర్భంగా లేడీ గాగా ‘నాటు నాటు’ పాటకు ఛీర్స్ చెబుతున్న వీడియోను అభిమాని ఒకరు సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. లేడీ గాగా కల్మషం లేని హృదయానికి నెటిజన్లు ఫిదా అయ్యారు.
సంచలనం సృష్టించిన దర్శకద్వయం
‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ఎట్ వన్స్’ చిత్రానికి గాను డానియల్ క్వాన్, డానియల్ షైనర్ట్ ఉత్తమ దర్శకులుగా పురస్కారాన్ని అందుకున్నారు. సినిమాల్లోకి రాకముందు ఈ దర్శకద్వయం మ్యూజిక్ ఆల్బమ్స్ రూపొందించేవారు. 2016లో వారి దర్శకత్వంలో వచ్చిన ‘స్విస్ ఆర్మీ మ్యాన్’ వినూత్న కథాంశంతో ఆకట్టుకుంది. ‘రొటీన్‌కు భిన్నమైన కథాంశాల్ని అందించాలన్నదే మా కర్తవ్యం. ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ఎట్ వన్స్’ చిత్రాన్ని కుంఫూ మూవీస్‌లోని యాక్షన్‌తో స్ఫూర్తిపొంది తీశాం. అనేకానేక సంక్లిష్టతలు, ఎంపికలు ఉన్న ప్రస్తుత మానవ జీవితాన్ని భిన్న కోణంలో, ఓ సమాంతర ప్రపంచం ద్వారా వైవిధ్యంగా చూపించాలన్న తపన నుంచి ఈ కథ పుట్టింది’ అని ఈ దర్శకద్వయం సినిమా గురించి పేర్కొన్నారు. ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్న మూడో దర్శకద్వయం వారు కావడం విశేషం. గతంలో వెస్ట్ సైడ్ స్టోరీ, నో కంట్రీ ఫర్ ఓల్డ్‌మెన్ చిత్రాలకు గాను ఇద్దరు దర్శకులు పురస్కారాల్ని పొందారు.
ఆస్కార్ గెలిచిన తొలి భారతీయ డాక్యుమెంటరీ చిత్రం
The Elephant Whisperers
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన ‘ది ఎలిఫెంట్ విష్పరర్’ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో 95వ ఆస్కార్ పురస్కారాన్ని దక్కించుకుంది. కార్తికి గాన్సాల్వ్స్ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరినీ 42 నిమిషాల నిడివితో తీశారు. తమిళనాడులోని ముడుమలై టైగర్ రిజర్వ్‌లో తెరకెక్కించారు. గునీత్ మోంగ నిర్మించారు. అడవి, వన్యప్రాణు పట్ల ఎంతో మమకారం ప్రదర్శించే బొమ్మన్, బెల్లీ దంపతులు రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లల సంరక్షణ బాధ్యతల్ని తీసుకుంటారు. ఆ దంపతులిద్దరూ వాటితో పెంచుకునే అనుబంధం, ఈ క్రమంలో జరిగే సంఘటనలతో ఈ డాక్యుమెంటరీ మానవీయ కోణంలో సాగుతుంది. ఓ శిశువు బాధ్యతలు తీసుకున్న విధంగానే అంతే ప్రేమతో ఏనుగు పిల్లలను సంరక్షించడం హృద్యంగా అనిపిస్తుంది. ఈ డాక్యుమెంటరీలో ప్రకృతి, మనిషి, వన్యప్రాణికి మధ్య ఉండే విడదీయలేని అనుబంధాన్ని దృశ్యమానం చేశారు. అనాథ ఏనుగు పిల్లల రాకతో బొమ్మన్, బెల్లీ జీవిత విధానమే మారిపోతుంది. అంతకుముందు అడబిడ్డను కోల్పోయిన దుఃఖంలో ఉన్న వారికి ఏనుగు పిల్లలు సాంత్వన చేకూరుస్తాయి. ఈ సినిమాతో దర్శకురాలు కార్తికి గోన్సాల్వెస్ తొలి ప్రయత్నంలోనే అకాడమీ పురస్కారాన్ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది.
ఓ సంఘటన ఆధారంగా…
దర్శకురాలు కార్తికి గోన్ సాల్వెస్ తాను నిజ జీవితంలో చూసిన ఓ సంఘటన స్ఫూర్తిగా ‘ద ఎలిఫెంట్ విష్పరర్స్’ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. అయిదేళ్ల క్రితం ఊటి దగ్గరలోని నీలగిరిలో ఓ వ్యక్తి ఏనుగు పిల్లలతో కలిసి వెళ్లడం చూసిందామె. అతనితో మాట కలపగా అడవిలో తప్పిపోయిన ఏనుగు పిల్లను తాను చేరదీశానని చెప్పాడు. వారిద్దరి మధ్య అనుబంధం కార్తికి హృదయాన్ని కదిలించి వేసింది. మనిషికి, మూగజీవికి ఉన్న సంబంధాన్ని తెలియజెప్పాలనే లక్ష్యంతో ఈ డాక్యుమెంటరీని రూపొందించింది. కార్తికి ఊటీ దగ్గరలోని ఓ గ్రామంలో పుట్టిపెరిగింది. దాదాపు 450 గంటల ఒరిజినల్ ఫుటేజీతో ఆమె ఈ డాక్యుమెంటరీకి రూపకల్పన చేసింది. అందుకోసం 18 నెలల పాటు బొమన్, బెల్లీ దంపతులతో అడవిలోనే గడిపింది.
తొలి దక్షిణాసియా మహిళ మిషెల్ యో
‘ది వేల్’ చిత్రంలోని నటనకుగాను బ్రెండన్ ఫ్రేసర్ ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని పొందారు. సైకలాజికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కెనడియన్-అమెరికన్ నటుడిగా పేరు పొందిన బ్రెండన్ ‘డాగ్‌ఫైట్’ (1991) చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. అనంతరం ది మమ్మీ ట్రయాలజీ, గాడ్స్ అండ్ మాన్స్టర్స్, క్రాష్ వంటి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ‘ది వేల్’ చిత్రంలో ఊబకాయంతో బాధపడుతున్న టీచర్‌గా బ్రెండన్ ఫ్రేసర్ నటన అందరిని ఆకట్టుకుంది. ఇక ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ఎట్ వన్స్’ చిత్రంలోని నటనకుగాను మిషెల్ యో ఉత్తమ నటిగా పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఆస్కార్ పురస్కారాన్ని పొందిన తొలి దక్షిణాసియా మహిళగా మిషెల్ యో సంచలనం సృష్టించారు. మలేషియాలో జన్మించిన మిషెల్ యో తొలుత హాంకాంగ్ యాక్షన్ సినిమాల ద్వారా పేరు తెచ్చుకుంది. అరవై ఏళ్ల మిషెల్ యో 2000 సంవత్సరంలో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. టు మారో నెవర్ డైస్, క్రౌచింగ్ టైగర్, హిడెన్ డ్రాగన్ వంటి చిత్రాలతో సత్తా చాటారు. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో పురస్కారాల్ని గెలుచుకున్న ఆమె ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ఎట్ వన్స్’ చిత్రానికిగాను తొలిసారి ఆస్కార్ గెలుచుకుంది.