యువకథానాయకుడు రోషన్ నటిస్తున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకుడు. స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా సినిమా విడుదల కానున్నది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చిందని మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో శనివారం ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇది స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథ. మైదానంలో ప్రత్యర్థులను సవాల్ చేస్తూ ఫుట్‌బాల్ గేమ్‌లో తన ప్రతిభను ప్రదర్శించిన హైదరాబాదీ ఆర్మీమాన్కి ఇంగ్లాండ్‌లో రాణి ఎలిజబెత్‌ను కలుసుకునే అవకాశం దక్కుతుంది. దేశం కోసం ఆడే అవకాశం అతనిని వరిస్తుంది.
కానీ.. అతని మనసు మాత్రం తన ప్రేయసి వద్దే ఉంటుంది. ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు, భావోద్వేగాలు, యుద్ధం, ప్రేమ.. ఇదే ఈ సినిమా కథ అని టీజర్ చెబుతున్నది. ఫుట్ బాలర్‌గా రోషన్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించాడు. హైదరాబాద్ మాండలీకంలో హిందీ మిక్స్ చేసిన అతని డైలాగ్ డెలివరీ చాలా సహజంగా, పాత్రోచితంగా ఉంది. యాక్షన్ సన్నివేశాల్లో ఎనర్జిటిక్‌గా, రొమాంటిక్ సీన్స్‌లో మ్యాన్లీగా, ఆత్మవిశ్వాసంతో కూడిన యాటిట్యూడ్‌తో రోషన్ టీజర్లో కనిపించారు. కథానాయిక అనస్వర రాజన్ చాలా అందంగా కనిపించింది. వీరిద్దరి కెమిస్ట్రీ కూడా బావుంది. ఈచిత్రానికి కెమెరా: ఆర్.మధీ, సంగీతం: మిక్కీ జె.మేయర్, సమర్పణ: జి.స్టూడియోస్.