Rishab Shetty | ‘కాంతార’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు కన్నడ హీరో రిషబ్‌శెట్టి. డివోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ‘కాంతార’ చిత్రానికి ప్రీక్వెల్‌గా రూపొందిస్తున్న ‘కాంతార-1’ షూటింగ్లో బిజీగా ఉన్నారాయన. పాన్ ఇండియా చిత్రం ‘జై హనుమాన్’ ద్వారా రిషబ్‌శెట్టి తెలుగులో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన హనుమంతుడి పాత్రను పోషిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది.
ఇదిలావుండగా.. రిషబ్‌శెట్టి సోలో హీరోగా తెలుగులో ఓ సినిమా చేయనున్నారని తెలిసింది. ‘ఆకాశవాణి’ ఫేమ్ అశ్విన్ గంగరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని, అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని సమాచారం. కథలోని కొత్తదనంతో పాటు తన పాత్రలోని భావోద్వేగాలు నచ్చడంతో రిషబ్‌శెట్టి ఈ సినిమాకు అంగీకరించారని, ఈ వారంలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం.