భారతీయ సినిమాను ఒక్కసారిగా సంభ్రమకు గురిచేసిన సినిమా ‘కాంతార’. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలై భాషలకు అతీతంగా భారీ విజయాన్ని నమోదు చేసిన సినిమా అది. ఆ సినిమాతో హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి గురించి దేశమంతా మాట్లాడుకుంది. ఆ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతార చాప్టర్ 1’ రేపు దసరాకు రానుంది. భారీ అంచనాలతో రానున్న ఈ సినిమాను, అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో రిషబ్ శెట్టి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ‘కాంతార చాప్టర్ 1’లో కొన్ని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేరు. ముఖ్యంగా ఒక సీన్ మీకు జీవితాంతం గుర్తుండిపోతుంది.
ఫ్యూచర్లో నన్ను చూసిన ఎవరికైనా ఆ సీనే గుర్తొస్తుంది. అన్ని భాషలవారూ ఈ సన్నివేశం గురించి మాట్లాడుకుంటారు. సినీపరిశ్రమలో చాలామందికి ఆ సన్నివేశం ప్రేరణగా మారుతుంది.’ అని తెలిపారు. ఇంకా చెబుతూ ‘నాకు దైవభక్తి ఎక్కువ. ఈ సినిమాలో దైవానికి సంబంధించిన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. వాటి చిత్రీకరణ సమయంలో కఠిన నియమాలు పాటించాను. మాంసాహారం తీసుకోలేదు. చెప్పులు వేసుకోలేదు. నాకు నేను పరిమితులు విధించుకున్నా’ అని తెలిపారు రిషబ్‌శెట్టి. ప్రస్తుతం ‘కాంతార చాప్టర్ 1’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నానని, దీని తర్వాత ‘జై హనుమాన్’ చేయబోతున్నానని, తన మనసుకు చాలా దగ్గరైన కథ ‘జై హనుమాన్’ అని రిషబ్ శెట్టి చెప్పారు.