‘కాంతారా’ తర్వాత దర్శక, నిర్మాతలంతా రిషబ్ శెట్టి డేట్స్ కోసం క్యూ కడుతుంటే.. ఆయన మాత్రం ఓ డైరెక్టర్‌తో సినిమా చేయాలనుందని ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఆ దర్శకుడెవరో కాదు.. మన సందీప్‌రెడ్డి వంగా. వివరాల్లోకెళ్తే.. నటుడు రానా ఓ టాక్‌షోని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ టాక్‌షోను రానా వైరైటీగా ప్లాన్ చేశారు. తను ఏ స్టార్‌ని ఇంటర్వ్యూ చేసినా.. అది సదరు స్టార్ ఇంట్లోనే షూట్ చేయబడుతుందనమాట.
ఈ క్రమంలో రిషబ్‌శెట్టిని ఇంటికెళ్లి కలిశారు రానా. ఈ ఇంటర్వ్యూలో భాగంగా తనకిష్టమైన దర్శకుడెవరు? ఎవరి డైరెక్షన్లో నటించాలని ఉంది? అని రానా ప్రశ్నించగా.. ‘నాకు సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో నటించాలని ఉంది. తనలా ఎవరూ ఆలోచించరు. ఆయన సినిమాను చూసే దృక్కోణం వేరుగా ఉంటుంది. అందుకే ఆయన డైరెక్షన్లో నటించాలని ఉంది. ఆయన చేసే ఏ సినిమాలోనైనా నటించేందుకు నేను సిద్ధం’ అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు రిషబ్ శెట్టి. మరి రిషబ్ ఎలాగూ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు కాబట్టి సందీప్ ఏవంటాడో చూడాలి.