రిషబ్శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార చాప్టర్ 1’ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న విషయం తెలిసిందే. అందులోని ఆయన నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో.. అసలు ‘కాంతార’ కథ ఎలా పుట్టిందో చెప్పుకొచ్చారు రిషబ్ శెట్టి. ‘20ఏళ్ల క్రితం మా గ్రామంలో ఓ సంఘటన జరిగింది. ఓ విధంగా ‘కాంతార’ కథకు బీజం అక్కడే పడిందని చెప్పాలి.
వ్యవసాయ భూమికోసం ఓ అటవీ అధికారికీ, రైతుకీ మధ్య జరిగిన ఘర్షణ అది. దాన్ని నేను ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణగా చూడలేదు. ప్రకృతిని కాపాడేందుకు ఇద్దరు పడుతున్న తాపత్రయంగా చూశాను. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకొని కథ రాయాలని అప్పుడే నిర్ణయించుకున్నా. అప్పట్నుంచీ మన సంస్కృతి మొత్తం వ్యవసాయం చుట్టూ ఎలా తిరుగుతుందో ఆలోచించడం మొదలుపెట్టా.’
అని రిషబ్ తెలిపారు. ఇంకా చెబుతూ “కాంతార’ తీస్తున్నప్పుడే అనిపించింది ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుందని. ‘కాంతార చాప్టర్ 1’తో ఆ నమ్మకం మరోసారి నిజమైంది. ఆలోచింపజేసే కంటెంట్ కథలో ఉంటే.. థియేటర్ బయట కూడా దాని గురించి ప్రేక్షకులు చర్చించుకుంటారు. మనం తీసే కంటెంట్ సామాన్యుడికి చేరువైతే అందరికీ చేరువైనట్టే.’ అని పేర్కొన్నారు రిషబ్ శెట్టి.