Nagarjuna | హైదరాబాద్‌లో 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు ఇటీవల అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.తాజాగా నగరంలోని చారిత్రాత్మక చౌమహల్లా ప్యాలెస్‌లో అందాల భామల కోసం ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ విందు కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సతీమణితో కలిసి హాజరయ్యారు. పలువురు ప్రతినిధులు, కంటెస్టెంట్లు కూడా సందడి చేశారు. చారిత్రాత్మక చౌమహల్లా ప్యాలెస్ కి 109 దేశాల నుంచి కంటెస్టెంట్లు రాగా, వారి రాకతో చౌమొహల్లా ప్యాలెస్ మెరిసిపోయింది. మరోవైపు ఈ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున , అల్లు అరవింద్ హాజరయ్యారు. వారు రేవంత్ రెడ్డి పక్కన కూర్చొని సరదాగా మాట్లాడుతూ కనిపించారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు అందుకున్న తర్వాత నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చి వేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై నాగార్జున సీరియస్ అవుతూ, దానిపై కోర్టులో పోరాటం చేస్తానని కూడా అన్నాడు.. ఇక అల్లు అరవింద్ ఫ్యామిలీ విషయానికి వస్తే.. సంధ్య థియేటర్ తొక్కిసలాట సంఘటనలో అల్లు అర్జున్‌ని పోలీసులు అరెస్ట్ చేయడం, తెలంగాణ అసెంబ్లీలో అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డి కాస్త ఘాటుగా స్పందించడం మనం చూశాం. ఆ సమయంలో అల్లు అర్జున్.. రేవంత్ రెడ్డి పేరు మరిచిపోయిన కారణంగా ఆయనపై కక్ష్య కట్టారని కొందరు కామెంట్లు చేశారు.
కట్ చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి .. నాగార్జున, అల్లు అరవింద్‌లతో కలిసి డిన్నర్లో పాల్గొనడం చర్చనీయాంశం అయింది. వారు సరదాగా మాట్లాడుకుంటూ కనిపించడంతో వివాదాలు సమసిపోయి ఉంటేయేమో అని నెటిజన్స్ ముచ్చటించుకుంటున్నారు. అల్లు అర్జున్‌కి కూడా ఇన్విటేషన్ పంపారని, కాని అందుబాటులో లేకపోవడం వలన డిన్నర్ కి హాజరు కాలేదని కొందరు చెబుతున్నారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. మొత్తంగా రేవంత్ రెడ్డి సెలబ్రిటీస్‌తో కలిసి సరదాగా మాట్లాడుతుండడంతో అంతా ఆల్ హ్యాపీస్ అని, వివాదాలకు ముగింపు పలికినట్లే అని జనాలు ముచ్చటించుకుంటున్నారు.