సినిమా పేరు : మాస్ జాతర
తారాగణం: రవితేజ, శ్రీలీల, నవీన్‌చంద్ర, రాజేంద్రప్రసాద్, నరేశ్, సముద్రఖని..
దర్శకత్వం : భాను భోగవరపు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య
రవితేజ సినిమా అంటే మాస్ ప్రేక్షకులకు ఓ విందు భోజనం. లాజిక్కులు చూడకుండా హీరోయిజాన్ని ఎంజాయ్ చేసేందుకు రవితేజ సినిమాను ఎంచుకుంటారు మాస్ ప్రేక్షకులు. ఈ శుక్రవారం రవితేజ ‘మాస్ జాతర’ సినిమా విడుదలైంది. ఎప్పటిలాగే థియేటర్ల వద్ద జాతర నెలకొన్నది. రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ కోసం ఆడియన్స్ థియేటర్లకు క్యూలు కట్టారు. ఈ సినిమా ప్రచార చిత్రాలు ఇప్పటికే పాపులర్ అవ్వడం, భీమ్స్ స్వరపరిచిన పాటలు ప్రాచుర్యం పొందడం.. ‘థమాకా’ తర్వాత మళ్లీ రవితేజ, శ్రీలీల కాంబినేషన్ రిపీటవ్వడం.. ఇవ్వన్నీ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణాలయ్యాయి. మరి దర్శకుడు భాను భోగవరపు చేసిన ఈ తొలి ప్రయత్నం సఫలం అయ్యిందా? రవితేజ మరోసారి మాస్ మహారాజా అనిపించారా? మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ముందు కథలోకి వెళ్లాలి.
కథ:
రైల్వే పోలీస్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్భేరీ(రవితేజ)కు కాస్త దూకుడు జాస్తి. నిజాయితీ ఇంకాస్త జాస్తి. అందుకే కుదరుగా ఎక్కడా డ్యూటీ చేయడు. ప్రతిసారీ ట్రాన్స్ఫర్లే. ఈ క్రమంలోనే అడవివరం అనే ఊరుకి బదిలీ అవుతాడు. ఆ ఊరు ఓ గంజాయి వనం. దాన్ని పండించి ఇతర ప్రాంతాలకు స్మగ్లింగ్ చేసే స్మగ్లర్ శివుడు(నవీన్‌చంద్ర). వాడో దుర్మార్గుడు. అడ్డొచ్చిన వాళ్లను చంపుకుంటూ పోతుంటాడు. వాడి వల్ల ఆ ఏరియా మొత్తం కలుషితమై ఉంటుంది. అక్కడంతా గంజాయిని సిగరెట్లు తాగినట్టు తాగేస్తుంటారు. అలాంటి పరిస్థితుల మధ్య లక్ష్మణ్‌భేరి అక్కడ అడుగుపెడతాడు. ఓసారి పెద్ద ఎత్తున సరుకు కోల్‌కతా పంపించాలనుకుంటాడు శివుడు. రోడ్ మార్గం సరిగ్గా లేకపోవడంతో సరుకును గూడ్స్ ఎక్కిస్తారు. ఆ ప్రయత్నాన్ని లక్ష్మణ్ అడ్డుకుంటాడు. ఆ తర్వాతేం జరిగింది? లక్ష్మణ్, శివుడు మధ్య ఎలాంటి పోరాటం నడిచింది? శివుడి సామ్రాజ్యాన్ని లక్ష్మణ్ ఎలా నేలమట్టం చేసి, ఆ ప్రాంతంలో శాంతి స్థాపన ఎలా జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
విశ్లేషణ:
ఏమాత్రం కొత్తదనం లేని కథ ఇది. ఓ ఏరియాలో ఓ విలన్. అక్కడ వాడి దురాగతాల్ని అంతం చేసేందుకు హీరో ఎంట్రీ ఇవ్వడం.. చివరికి వాడ్ని చంపడం.. ఈ రొడ్డకొట్టుడు పాయింట్‌తో కొన్ని వేల సినిమాలొచ్చాయి. నిజానికి ‘విక్రమార్కుడు’ టైమ్‌కే ఇది పాత పాయింట్. కాన్నీ దాన్ని రాజమౌళీ వేరే స్థాయిలో తీసి బ్లాక్‌బస్టర్ చేశారు. కానీ ఈ విషయంలో కొత్త దర్శకుడు భాను భోగవరపు కొంతమేర మాత్రమే సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు. పాత కథ తీసినప్పుడు దాన్ని కొత్తగా ప్రజెంట్ చేయాలి. హీరోయిజం, ఎలివేషన్లు, పాటలు, సమస్యలు.. ఇవన్నీ కొత్తగా ఉండాలి. స్క్రీన్‌ప్లే ఆకట్టుకునేలా ఉండాలి. అప్పుడు కథ పాతదైనా జనం మెచ్చేస్తారు. అలా కానప్పుడే ఫలితాలు వేరేలా ఉంటాయి. రచయిత భాను భోగవరపు తొలి ప్రయత్నంగా తీసిన సినిమా కాబట్టి కథ విషయంలో కచ్ఛితంగా జాగ్రత్త పడతాడనే అంతా అనుకున్నారు. కానీ ‘మాస్ జాతర’ సినిమా ఎక్కడా కొత్తగా అనిపించదు. కానీ కొన్ని సీన్స్ మాత్రం చాలా బాగా తీశాడు. కథ ఎక్కువ శాతం రైల్వేస్టేషన్ చుట్టూనే తిరుగుతుంది. దాంతో ఓ కొత్త సినేరియా తెరపై కనిపించింది. అలాగే.. వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తే సమాజం బాగుంటుందని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా ఒక్క వ్యవస్థ సరిగ్గా పనిచేసినా చాలు మిగతావన్నీ సర్దుకుంటాయనే మంచి విషయాన్ని కూడా ఇందులో చెప్పాడు. రవితేజ మార్క్ హీరోయిజం.. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్.. డైలాగ్ టైమింగ్.. యాక్షన్.. ఎంటర్టైన్మెంట్ ఎప్పటిలాగే అదరహో అనిపించారు. ఇక శ్రీలీల పాత్రను పరిచయం చేసిన తీరు బావుంది. సరదాగా కనిపిస్తున్న ఆమె జీవితంలోని విషాదం కథకు బలాన్నీ తెచ్చింది. ఇక నవీన్‌చంద్ర శక్తివంతమైన విలన్‌గా చాలా బాగా చేశాడు. రవితేజ, నవీన్‌చంద్ర కాంబినేషన్ సీన్స్ బావున్నాయి. కొన్ని సన్నివేశాలు ‘క్రాక్’ సినిమాను గుర్తు చేస్తాయి. మరికొన్ని సన్నివేశాలు ‘విక్రమార్కుడు’ని జ్ఞప్తికి తెస్తాయి. పాటలు ఇడియట్, థమాకా చిత్రాలను గుర్తుచేస్తాయి. మొత్తంగా రవితేజ పాత సినిమాలను గుర్తు చేసే విధంగా సినిమా ఉంది. వింటేజ్ రవితేజను ఆవిష్కరించే ప్రయత్నాన్ని చేశాడు దర్శకుడు భాను భోగవరపు. ఈక్రమంలో కథను పెద్దగా పట్టించుకోలేదు.
నటీనటులు:
రవితేజ ఎప్పటిలాగే తన మార్క్ పెర్ఫార్మెన్స్తో తెరపై సందడి చేశాడు. 50ప్లస్ లోనూ ఆయనలో జోష్ ఇసుమంత కూడా తగ్గలేదు. పాటల్లో, ఫైటుల్లో అదే జోష్. కామెడీలో అదే టైమింగ్. ఇక శ్రీలీల పాత్ర కథలో భాగమే అయినా.. పాటలకే ఎక్కువ ప్రాధానతిచ్చినట్టు అనిపిస్తుంది. నవీన్‌చంద్ర విలన్‌గా అదరగొట్టేశాడు. ఈ సినిమా విషయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది నటకిరీటి రాజేంద్రప్రసాద్ గురించి. చాలాకాలం తర్వాత ఆయన నుంచి ఓ మంచి పెరఫార్మెన్స్ను ఈ సినిమాలో చూడొచ్చు. అలాగే నరేశ్, సముద్రఖని అంతా పరిధిమేర తమ పాత్రలను రక్తికట్టించారు.
సాంకేతికంగా:
స్క్రిప్ట్ విషయంలో దర్శకుడు భాను భోగవరపు కాస్త జాగ్రత్త పడితే బావుండేది. రవితేజను మాత్రం బాగా చూపించాడు. భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన సంగీతం అందించాడు. పాటలతో చెలరేగిపోయారాయన. ప్రతి పాటా ఆట్టుకునేలా ఉంది. పిక్చరైజేషన్ కూడా బావుంది. కెమెరా వర్క్ కూడా అభినందనీయంగానే ఉంది. సెకండాఫ్‌లో ఎడిటింగ్ అవసరం ఉంది.
చివరిగా చెప్పొచ్చేదేంటంటే.. విక్రమార్కుడు, క్రాక్ చిత్రాలను మిక్సర్‌లో వేసి మిక్సీ చేసి, ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని, పాన్‌లో ‘ఇడియట్’ వేసి, కాసేపు కాగాక, ఈ మిశ్రమాన్ని కలిసి, చివరిగా ‘థమాకా’ జల్లితే.. ‘మాస్ జాతర’. మాస్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చే అవకాశం లేకపోలేదు.
బలాలు:
రవితేజతోపాటు ఇతర నటీనటుల నటన, సంగీతం, యాక్షన్ ఎలిమెంట్స్..
బలహీనలు:
కథ, కథనం..
రేటింగ్ : 2.75/5