FIR | విష్ణు విశాల్ హీరోగా వస్తున్న కొత్త సినిమా ‘ఎఫ్ఐఆర్’. విష్ణు విశాల్ స్టూడియోస్ పతాకంపై విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ తెలుగులో విడుదల చేస్తున్నది. హీరో రవితేజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మను ఆనంద్ దర్శకత్వం వహించారు. గౌతమ్ మీనన్, మంజిమా మోహన్, రైజా విల్సన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. డార్క్ యాక్షన్ థ్రిల్లర్ గా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. సందీప్ కిషన్, సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీడియో కాల్ ద్వారా రవితేజ మాట్లాడుతూ ‘ఆర్నెళ్ల క్రితం ఈ సినిమా చూశాను. బాగా నచ్చింది. విభిన్నమైన సినిమా ఇది. ఇలాంటి చిత్రంలో నేనూ నటించాలని కోరుకుంటున్నా. ‘ఎఫ్ఐఆర్’ చిత్రబృందానికి శుభాకాంక్షలు’ అని తెలిపారు. ‘ఈ సినిమా ఓటీటీ విడుదల అనేది మనసులోకి రాలేదు. థియేటర్ లోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదలకు వస్తున్నాం. మాకు సపోర్ట్ గా ఉన్న అభిషేక్ పిక్చర్స్, రవితేజ గారికి కృతజ్ఞతలు’ అన్నారు హీరో విష్ణు విశాల్. కథ బాగుంటే భాషతో సంబంధం లేదని, విభిన్న కథలు ఎంచుకుంటున్న విష్ణు విశాల్ ను చూస్తే సంతోషంగా ఉందని అన్నారు సందీప్ కిషన్.