రవితేజ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ధమాకా’. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీలీల నాయికగా నటిస్తున్నది. ఈ సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన అనుభవాలు తెలిపారు భీమ్స్ సిసిరోలయో. ఆయన మాట్లాడుతూ…‘రవితేజతో ‘బెంగాల్ టైగర్’ చిత్రం తర్వాత నేను మ్యూజిక్ చేసిన సినిమా ఇదే.
ఈ గ్యాప్లో నేను ఆయనతో కలిసి పనిచేయకున్నా మిగతా చిత్రాలకు కంపోజ్ చేసిన ప్రతి పాటా ఆయనను దృష్టిలో పెట్టుకుని స్వరపర్చిందే. ఆయనను చూస్తేనే పాటకు ఇన్సిపిరేషన్ వస్తుంది. మా గత సినిమా కంటే ఇది పెద్ద మ్యూజికల్ హిట్ అవుతుంది. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పటిదాకా రిలీజ్ చేసిన జింతాక్, వాట్స్ హ్యాపెనింగ్, మాస్ రాజా, డు..డు..పాటలకు రెస్పాన్స్ బాగుంది. హీరోతో ఒక లైన్ పాడించాం. నా కెరీర్లో బొంబై పోతావ రాజా, డియ్యో డియ్యో పాటలు ఎప్పటికీ శ్రోతలకు గుర్తుండిపోతాయి. ఇటీవల నాకు కొంత గ్యాప్ వచ్చింది. ఇకపై వరుసగా సినిమాలు చేయబోతున్నా. వచ్చే ఏడాదికి కనీసం పది ప్రాజెక్ట్లు నా చేతిలో ఉన్నాయి’ అన్నారు.