Ravi Teja | మాస్ మహారాజా రవితేజ గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద సరైన విజయాన్ని అందుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు వరుస హిట్లతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక మార్కెట్‌ను సృష్టించుకున్న రవితేజ, ఇప్పుడు వరుస పరాజయాలతో కెరీర్లో కీలక దశను ఎదుర్కొంటున్నారు. ఇటీవల విడుదలైన సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో, ఆయన తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు కమర్షియల్ ఎంటర్టైనర్స్తో ప్రేక్షకులను అలరించిన రవితేజ, ఇప్పుడు మార్కెట్ పరిస్థితులను బట్టి తన నిర్ణయాల్లో మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా రెమ్యూనరేషన్ విషయంలో ఆయన తీసుకున్న తాజా నిర్ణయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు సినిమా కోసం రూ.25 కోట్ల వరకు పారితోషికం తీసుకున్న రవితేజ, ప్రస్తుతం తన రెమ్యూనరేషన్‌ను రూ.15 కోట్లకు తగ్గించుకున్నారని సమాచారం.
నిర్మాతలపై అదనపు భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వరుస డిజాస్టర్ల తర్వాత మార్కెట్లో తన స్థాయిని మళ్లీ నిలబెట్టుకోవాలంటే ముందుగా మంచి విజయాన్ని అందుకోవాల్సిన అవసరం ఉందని రవితేజ భావిస్తున్నారట. అందుకే ప్రస్తుతం కథల ఎంపికలో కూడా ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’ పై ఇండస్ట్రీలో మంచి ఆసక్తి నెలకొంది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా రవితేజ కెరీర్లో పూర్తిగా భిన్నమైన ప్రయత్నంగా చెబుతున్నారు. ఇప్పటివరకు ఎక్కువగా మాస్, కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్స్ చేసిన రవితేజ, ఈసారి థ్రిల్లర్ జానర్‌ను ఎంచుకోవడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
‘ఇరుముడి’ సినిమా కథ, ట్రీట్మెంట్, రవితేజ పాత్ర పూర్తిగా కొత్తగా ఉండబోతున్నాయని సమాచారం. ఈ సినిమా విజయమే ఇప్పుడు ఆయన కెరీర్‌కు చాలా కీలకంగా మారింది. ఒకవేళ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తే రవితేజ మళ్లీ ఫామ్‌లోకి రావడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. లేదంటే ఆయన మార్కెట్‌పై మరింత ప్రభావం పడే అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతోంది. టాలీవుడ్లో ప్రస్తుతం స్టార్ దర్శకులందరూ అగ్ర హీరోలతో బిజీగా ఉండటంతో, రవితేజకు యంగ్ డైరెక్టర్లే ప్రధాన బలం అవుతున్నారు. కొత్త కథలు, డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ప్రయత్నంలో మాస్ మహారాజా ఉన్నారని తెలుస్తోంది. అందుకే ‘ఇరుముడి’ సినిమాపైనే ఆయన ఆశలన్నీ పెట్టుకున్నారని సినీ వర్గాలు అంటున్నాయి.