Ravi Teja | మాస్ మహారాజా రవితేజ మళ్లీ మాస్ ట్రాక్‌లోకి రావడానికి సిద్దమయ్యాడు. ఈ నెల అక్టోబర్ 31న విడుదల కానున్న ఆయన 75వ చిత్రం ‘మాస్ జాతర’ తర్వాత వరుసగా మూడు కొత్త సినిమాలు లైన్లో ఉన్నాయి. ఒక్కో సినిమా వేర్వేరు జానర్లో ఉండటంతో, ఈసారి రవితేజ కెరీర్‌ను రీబూట్ చేసే సిరీస్ ఇదే అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు. ‘ధమాకా’ తర్వాత మరోసారి శ్రీలీలతో జోడీ కట్టిన రవితేజ, ఈసారి కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను నాగవంశీ మరియు సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్లు మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. రవితేజ మార్క్ మాస్ యాక్షన్, ఎనర్జీతో కూడిన ఎంటర్టైనర్గా ఇది నిలిచే అవకాశం ఉంది.
‘నేను శైలజ’, ‘రెడ్’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కిశోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న 76వ సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఇందులో ఆషికా రంగనాథ్, కేతిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్పెయిన్‌లో షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రానికి మొదట ‘అనార్కలి’ అనే టైటిల్ పరిశీలించగా, చివరికి ఈ పేరునే ఫైనల్ చేసినట్లు సమాచారం. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి 2026లో విడుదల కానుంది.77వ ప్రాజెక్ట్ కోసం రవితేజ ‘నిన్ను కోరి’, ‘మజిలీ’, ‘ఖుషీ’ దర్శకుడు శివ నిర్వాణతో జట్టుకట్టనున్నారు. ఇది ఓ థ్రిల్లర్ డ్రామా జానర్లో తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ తన వయసుకు తగ్గ సీరియస్, ఇంటెన్స్ పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం.
రవితేజ 78వ ప్రాజెక్ట్‌గా కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించే ఓ సూపర్ హీరో కాన్సెప్ట్ మూవీ ప్లాన్ చేశారు. ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలతో పేరు తెచ్చుకున్న కళ్యాణ్ శంకర్‌కు ఇది మరో డిఫరెంట్ ప్రాజెక్ట్ కానుంది. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. అయితే రవితేజ నుండి రానున్న నాలుగు సినిమాలు నాలుగు డిఫరంట్ జానర్స్ లో రూపొందుతున్నాయి. ‘మాస్ జాతర’ – పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ – ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా, శివ నిర్వాణ మూవీ – థ్రిల్లర్ డ్రామా, కళ్యాణ్ శంకర్ మూవీ – సూపర్ హీరో కాన్సెప్ట్. ఈ నాలుగు సినిమాలతో రవితేజ మరోసారి సక్సెస్ ట్రాక్‌లోకి ఎంటర్ అవుతాడా లేదా అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ ఇప్పుడు డిఫరెంట్ సినిమాలతో అలరించనున్నాడు.