Ravi Teja | టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి – మాస్ మహారాజా రవితేజ మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవిని తన కెరీర్లో గురువుగా భావించే రవితేజ, సినీ ప్రయాణం ప్రారంభ దశలో ఆయన సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించారు. కాలక్రమేణా స్టార్‌గా ఎదిగి, చిరంజీవితో కలిసి కీలక పాత్రలు చేసే స్థాయికి చేరుకున్నారు. ఇద్దరూ ఎప్పుడూ ఒకరిపై ఒకరు గౌరవం, అభిమానాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా సంక్రాంతి 2026 సందర్భంగా విడుదలైన సినిమాల నేపథ్యంలో ఈ ఇద్దరి పేర్లు అనుకోకుండా వివాదంలోకి వచ్చాయి. చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. అదే సమయంలో రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కూడా విడుదలై, మోస్తరు స్పందన రాబట్టింది.
ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సక్సెస్ మీట్లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సంక్రాంతి సినిమాల గురించి మాట్లాడుతూ చిరంజీవి, “ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను ఒక్కటే కోరుకున్నాను. సంక్రాంతికి వచ్చిన ఐదు సినిమాలు బాగా ఆడాలి, థియేటర్లు నిండాలి, ప్రేక్షకులు రావాలి. అదే జరిగింది. దాదాపు అన్ని సినిమాలు ప్రజల ఆదరణ పొందాయి. ఒకటి అరా అటు ఇటుగా ఉన్నా కూడా ఇది మంచి సంక్రాంతి” అని వ్యాఖ్యానించారు. ఇక్కడే వివాదానికి బీజం పడింది. ‘ఒకటి అరా అటు ఇటుగా’ అనే మాటలు రవితేజ సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ను ఉద్దేశించినవేనని కొందరు రవితేజ అభిమానులు భావించారు. దీంతో సోషల్ మీడియాలో చిరంజీవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. తమ హీరో సినిమా రిజల్ట్‌ను బహిరంగ వేదికపై ప్రస్తావించారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కానీ మరోవైపు, చాలా మంది నెటిజన్లు మాత్రం ఈ విమర్శలకు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. చిరంజీవి తన మాటల్లో ఏ సినిమా పేరును కూడా ప్రస్తావించలేదని, పైగా “దాదాపు అన్ని సినిమాలు ఆదరణ పొందాయి” అని పాజిటివ్‌గా మాట్లాడారని చెబుతున్నారు. ఇది ఎవరి మీదైనా వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్య కాదని, మొత్తం సంక్రాంతి సీజన్‌పై చేసిన సాధారణ విశ్లేషణ మాత్రమేనని అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, చిరంజీవి–రవితేజ మధ్య ఉన్న స్నేహం, పరస్పర గౌరవాన్ని గుర్తు చేస్తూ, ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవల్సిన అవసరం లేదని పలువురు సినీ అభిమానులు అంటున్నారు. మెగాస్టార్ ఎప్పుడూ సహనటులను లేదా ఇతర హీరోలను కించపరిచేలా మాట్లాడలేదన్నది వారి వాదన.