కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన బీబీ హోటల్ టాస్క్ మంచి రసవత్తరంగా సాగుతుంది. ఎవరికి వారు తమ పాత్రలలో జీవించేస్తున్నారు. ముఖ్యంగా హనీమూన్ కపుల్‌గా ఉన్న ప్రియాంక- మానస్ అయితే పాత్రల నుండి బయటకు వచ్చేందుకు ఏ మాత్రం ఇష్టపడడం లేదు. వీజే సన్నీ ఊరమాస్‌గా అదరగొట్టాడు. యాంకర్ రవి సీక్రెట్ టాస్క్ పూర్తి చేసేందుకు నానా తంటాలు పడుతున్నాడు.
ఇక సిరి అయితే దొరికిందే ఛాన్స్ అన్నట్టు షణ్ముఖ్‌తో కాళ్లు కూడా పట్టించుకుంది. మొత్తానికి గురువారం ఎపిసోడ్ కాస్త ఎంటర్టైనింగ్గానే సాగిందనే చెప్పాలి. ఇక రవి తన దగ్గర డబ్బులు కొట్టేయడంతో.. కాజల్ మాటు వేసి ఆనీ మాస్టర్ దగ్గర డబ్బుల్ని నొక్కేసింది. ఆ తరువాత కాజల్ తాగే వాటర్‌లో కారం కలిపేశాడు రవి. ఆ విషయాన్ని కాజల్ పసిగట్టేసింది. రవికి సీక్రెట్ టాస్క్ ఇచ్చినట్టు ఉన్నారని ముందే పసిగట్టేసింది
మరోపక్క షణ్ముఖ్.. నువ్వు దొంగతనం చేశావన్న విషయం తనకు తెలుసంటూ రవితో నేరుగా చెప్పాడు. అడ్డంగా దొరికిపోయినప్పటికీ రవి మాత్రం తాను తీయలేదని బుకాయించాడు. చాలా మందికి రవిపైన అనుమానం ఉండగా, హోటల్‌కి వచ్చిన అతిథులు రవికి డబ్బులు ఇవ్వకూడదని ఓ నిర్ణయానికి వచ్చారు.అయితే చాకిరి చేయించుకుంటున్న గెస్ట్స్ తక్కవ డబ్బులు ఇవ్వడంపై మండి పడింది అనీ మాస్టర్. నేను మనిషినా? పశువునా? అని ఆవేశపడింది. కుక్కల్లా పనులు చేయిస్తున్నారు, కానీ డబ్బులు ఇవ్వరు అంటూ ఏడ్చేసింది.