Actress Hema | తాను చేయని తప్పుకు తనను బలి చేశారంటూ టాలీవుడ్ సీనియర్ నటి హేమ (Hema) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేవి నవరాత్రులు సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్న హేమ అనంతరం మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కన్నీరు పెట్టుకుంది.
నేను ప్రతీ ఏటా దుర్గమ్మ దర్శనానికి వస్తాను. అయితే ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఉంది. గత ఏడాది మీరందరూ నాపై వేసిన నిందలను దుర్గమ్మ తుడిచిపెట్టింది. నేను చేయని తప్పుకి మీరందరూ నన్ను బలి చేశారు. దాని నుండి బయటపడటం నావల్ల కాలేదు. కానీ నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చి ఈరోజు నన్ను గుడికి వచ్చేటట్టు ఆ దుర్గమ్మ చేసింది. ప్రతిక్షణం తల్లీ నేనున్నాను నువ్వు ముందుకెళ్లు అని నన్ను బతికిచ్చింది. ఎన్ని జన్మలెత్తినా దుర్గమ్మ ఆశీస్సులు మర్చిపోలేను అని హేమ కన్నీళ్లతో చెప్పుకోచ్చింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు హేమ ఒక విజ్ఞప్తి చేస్తూ.. దయచేసి మీరు ఏదైనా వార్త వేసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకుని వేయండంటూ కోరింది.
కొన్ని నెలల క్రితం బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయం టాలీవుడ్లో పెద్ద కలకలం రేగింది. అంతేకాకుండా నిర్వహించిన పరీక్షల్లో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లుగా పాజిటివ్ వచ్చిందని పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆమెకు నోటీసులు జారీ చేసి, విచారణకు పిలిచి బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత హేమపై నమోదైన కేసుపై కోర్టు స్టే విధించడంతో ఆమెకు కొంత ఊరట లభించింది. ప్రస్తుతం ఈ కేసు ఇంకా కోర్టులో నడుస్తుంది.