కర్ణాటక సంగీత విద్వాంసురాలు, భారతరత్న ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవిత కథ వెండితెర దృశ్యమానం కానుంది. ఈ బయోపిక్కు ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తారు. రాక్‌లైన్ వెంకటేష్, అల్లు అరవింద్ నిర్మించనున్నారని సమాచారం. గత కొంతకాలంగా ఈ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాత్రలో నటించే కథానాయిక ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సాయిపల్లవి, రుక్మిణి వసంత్ పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం సాయిపల్లవి చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉండటంతో ఈ బయోపిక్ కోసం డేట్స్ కేటాయించే పరిస్థితి లేదని తెలిసింది.
ఈ నేపథ్యంలో తాజాగా రష్మిక మందన్న పేరు బయటికొచ్చింది. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాత్రధారిణి ఖరారు చేసే పనిలో ఉన్న మేకర్స్ ఇటీవలే రష్మిక మందన్నను సంప్రదించారని, ఆమె ఈ చిత్రంలో నటించేందుకు సుముఖత వ్యక్తం చేసిందని సమాచారం. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 16న ఈ సినిమా తాలూకు అధికారిక ప్రకటన వెలువడనుందని తెలిసింది. ప్రస్తుతం రష్మిక మందన్న ‘రణబాలి’ ‘మైసా’ చిత్రాల్లో నటిస్తున్నది. వివాహానంతరం విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ‘రణబాలి’ దసరా సందర్భంగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకురానుంది.