ఇటీవల జరిగిన గోవా చిత్రోత్సవంలో ‘కాంతార’ చిత్రం గురించి బాలీవుడ్ అగ్ర హీరో రణ్‌వీర్‌సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ‘కాంతార’ చిత్రంలో కథానాయకుడు రిషబ్‌శెట్టి అభినయాన్ని ప్రశంసించిన రణ్వీర్.. ‘ఆయన దెయ్యాన్ని ఆవాహనం చేసుకొని నటించే సన్నివేశాలు మరింత అద్భుతంగా అనిపించాయి’ అన్నారు. అంతేకాకుండా సినిమాలో వచ్చే ‘ఓ’ అనే శబ్దాన్ని స్జేజీపై అనుకరించి చూపించారు. అయితే అందులో వెకిలితనం కనిపించిందని, పవిత్రమైన పంజుర్లి దైవాన్ని.. దెయ్యం అంటూ మాట్లాడారని కన్నడ ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. హిందూ జనజాగృతి సమితి రణ్‌వీర్‌పై ఫిర్యాదు చేసింది.
తాజాగా ఈ వివాదంపై రణ్‌వీర్‌సింగ్ క్షమాపణలు చెప్పారు. తనకు ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యం లేదని ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘దేశంలోని ప్రతీ ప్రాంతం, సంప్రదాయంపై నాకు గొప్ప గౌరవం ఉంది. రిషబ్‌శెట్టి నటనను పొగుడుతూ నేను ఆయనలా చేసి చూపించాను. అలాంటి సన్నివేశాల్లో నటించడం చాలా కష్టం. ఎలాంటి పాత్రనైనా అద్భుతంగా పోషిస్తాడు కాబట్టే రిషబ్ని నేను చాలా ఇష్టపడతాను. నా మాటలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమాపణలు తెలియజేస్తున్నా’ అని రణ్‌వీర్‌సింగ్ పేర్కొన్నారు. దాంతో ఈ వివాదానికి తెరపడినట్లయింది.