Ramoji Rao | ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు (88) (Ramoji Rao) శనివారం ఉదయం కన్నుమూశారు. ఇక రామోజీ రావు మృతితో మీడియా రంగంతో పాటు సినీ రంగం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక రామోజీరావు కెరీర్లో కీలక మలుపు అంటే ఈనాడు పత్రికను మొదలుపెట్టడమే.
వైజాగ్ వేదికగా 1974లో ఈనాడు పత్రికను ప్రారంభించిన ఆయన దాని ద్వారా కొన్ని వేలమంది పాత్రికేయులను తయారు చేశారు. దీని తర్వాత 1995 ఆగస్టులో తెలుగు ప్రేక్షకుల కోసం ఈటీవీని ప్రారంభించారు. తక్కువ సమయంలోనే ఈ ఛానల్ అభిమానులు మనసులను దోచుకుంది. ఇక ఈటీవీలో వచ్చే రాత్రి 9 గంటల వార్తలకు అయితే ఇప్పుడు కూడా జనాలు ఆసక్తిగా చూస్తారు.
మరోవైపు సినీ రంగంలో కూడా రామోజీ రావు విశేష కృషి చేశారు. తన సోంత నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌పై ఇప్పటివరకు వివిధ భాషల్లో 87 సినిమాలు నిర్మించారు. ఈ బ్యానర్‌తోనే టాలీవుడ్ నటులు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, దర్శక దిగ్గజం రాజమౌళి తదితరులు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్లో చివరిగా 2015లో రాజేంద్రప్రసాద్ నటించిన దాగుడుమూత దండాకోర్ సినిమా వచ్చింది. కేవలం పెద్ద తెరకు మాత్రమే పరిమితం కాకుండా బుల్లితెరపై తన సత్తా చూపించారు. భాగవతం, అన్వేషిత, ఎండమావులు, ఆడపిల్ల, పంచతంత్రం లాంటి బ్లాక్ బస్టర్ ధారవాహికలను అందించారు.
కాలంతో పాటు మారుతూ.. రీసెంట్గా ఓటీటీలో కూడా ఎంట్రీ ఇచ్చారు రామోజీ రావు. ఈనాడు గ్రూప్ నుంచి వచ్చిన ఓటీటీ వేదిక ఈటీవీ విన్. కేవలం తెలుగు సినిమాలతో పాటు తెలుగు ధారవాహికలు, ప్రోగ్రామ్స్ ఈ ఓటీటీలో ప్రసారం అవుతుంటాయి.