Rambha | ఒకప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగొందిన నటి రంభ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి వెంకటేశ్వరావు అనారోగ్య సమస్యలతో కన్నుమూసినట్లు సమాచారం. ఈ వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రంభ జీవితంలో అత్యంత కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో ఆమె తండ్రి కూడా ఒకరని సినీ వర్గాలు చెబుతున్నాయి. సినిమా రంగంలో రంభ ఎదుగుదలకు ఆమె కుటుంబం నుంచి బలమైన మద్దతు లభించింది. ముఖ్యంగా తన సినీ ప్రయాణం ప్రారంభ దశలో ఆమెకు తండ్రి వెంకటేశ్వరావు అండగా నిలిచినట్లు గతంలో రంభ పలు సందర్భాల్లో పేర్కొన్నారు.
కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా కుటుంబం నుంచి వచ్చిన ప్రోత్సాహమే తనను ముందుకు నడిపించిందని ఆమె చెప్పిన సందర్భాలున్నాయి. తండ్రి మృతిపై రంభ సోషల్ మీడియా ద్వారా తీవ్ర భావోద్వేగంతో స్పందించారు. తన అధికారిక ఖాతాలో చేసిన పోస్ట్‌లో, “నువ్వు లేకుండా నేను లేను నాన్న.. నా జీవితంలో నువ్వు నింపిన శూన్యాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను” అంటూ తన మనసులోని బాధను వ్యక్తం చేశారు. ఆమె షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషాద వార్త తెలిసిన తర్వాత పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా రంభకు సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ కష్టకాలంలో ఆమె కుటుంబానికి ధైర్యం కలగాలని ఆకాంక్షిస్తూ సంతాప సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.
ఒకప్పుడు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రంభ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనప్పటికీ అభిమానుల్లో మాత్రం అదే ఆదరణను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆమె వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న ఈ విషాదం అభిమానులను కూడా కలచివేస్తోంది.