Comedian | తెలుగు సినిమా ప్రేక్షకులకు చిరపరిచితమైన కమెడియన్ రామచంద్ర ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నాడు. కామెడీ టైమింగ్‌తో ఎన్నో సినిమాల్లో నవ్వులు పూయించిన ఈ నటుడికి ఇటీవల పక్షవాతం (పెరలాసిస్) రావడం సినీ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. రామచంద్ర “వెంకీ” సినిమాలో రవితేజ ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ఓ సభ్యుడిగా కనిపించి తన యాస, కామెడీ డైలాగ్‌లతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. తరువాత “గౌతమ్ SSC” సినిమాలో కూడా తన కామెడీ టైమింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. సినీ కెరీర్ ప్రారంభంలో అతని పాత్రకి తక్కువ డైలాగులు ఉన్నా పక్కా కామెడీ పంచ్‌లు వేసే నటుడిగా దాదాపు అందరు స్టార్ హీరోల చిత్రాల్లో కనిపించాడు.
అయితే కాలక్రమంలో అవకాశాలు తగ్గిపోయి, ఇటీవల డీజే టిల్లు, సార్ వంటి చిత్రాల్లో చిన్నపాత్రల్లో మాత్రమే కనిపించాడు.ఇటీవల ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూకు హాజరైన రామచంద్ర, ఆరోగ్య విషయాలు వెల్లడిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. “ఒక 15 రోజుల క్రితం ఓ డెమో షాట్ కోసం వెళ్లాను. అక్కడే సడెన్ గా చేతులు, కాళ్లు లాగేయడం మొదలయ్యాయి. వెంటనే షూట్ వదిలేసి వచ్చేశాను.” అని చెప్పాడు. రెండు రోజులకు డాక్టర్ దగ్గరికి వెళ్లాక స్కాన్ చేయించుకోగా, అప్పుడే చెప్పారు, ఇది పక్షవాతమని. బ్రెయిన్లో రెండు క్లాట్స్ ఉన్నాయని చెప్పారు. వాటివల్లే లెఫ్ట్ హ్యాండ్, లెగ్ పనిచేయడం ఆగిపోయాయి. క్లాట్స్ తగ్గితే మళ్లీ తిరిగి బాగవుతుందని చెప్పారు. ప్రస్తుతం మందులతో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను.” అని ఎమోషనల్‌గా చెప్పారు.
ఆర్ధికంగా కూడా చాలా బలహీనంగా ఉన్న రామచంద్ర, ప్రస్తుతం చికిత్స ఖర్చులను భరించేందుకు ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు నెటిజన్లు, యూట్యూబ్ ప్రేక్షకులు ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వీడియో చూసి, ఆర్ధిక సాయం చేయాలని సోషల్ మీడియాలో పిలుపు ఇస్తున్నారు. సినీ ప్రముఖులు కూడా స్పందించి సహాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య రామచంద్ర ఇండస్ట్రీలోకి వచ్చి 25 ఏళ్లు అవుతోంది. ‘నిన్ను చూడాలని’ సినిమాతో తొలి అవకాశాన్ని అందుకున్నాను అని చెప్పారు. తర్వాత ‘ఆనందం’, ‘వెంకీ’ వంటి సినిమాలు మంచి గుర్తింపు తెచ్చాయి,” అని గుర్తు చేసుకున్నాడు. సంపాదించిన డబ్బులతో ఓ బిజినెస్ ప్రారంభించాను… కానీ ఆ డబ్బులు అన్నీ పోయాయి. తర్వాత రోడ్డు ప్రమాదం కూడా జరిగింది. దాని వల్ల మూడేళ్లు సినిమాలకి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ విరామం ఆయన ఆర్థిక పరిస్థితిని పూర్తిగా కుదించేలా చేసిందని, అప్పుల ఊబిలో పడేసిందని అన్నాడు.