Ram Pothineni | జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవల ఆయన నటించిన ‘ఆంధ్రాకింగ్ తాలుకా’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి సారించిన రామ్, సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే, ఆయన వ్యక్తిగత జీవితంపై మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా పెళ్లి, ప్రేమ విషయాలపై ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ‘ఆంధ్రాకింగ్ తాలుకా’ సినిమాలో తనతో కలిసి నటించిన భాగ్యశ్రీ బోర్సేతో రామ్ రిలేషన్లో ఉన్నాడన్న వార్తలు వినిపించాయి. సినిమా ప్రమోషన్లలో ఇద్దరూ కలిసి పాల్గొనడం ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. అయితే ఈ వార్తలపై ఎప్పుడూ స్పష్టత ఇవ్వని రామ్, తాజాగా తన మనసులోని భావాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
నేను చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉండటానికి అలవాటు పడ్డాను. ఖాళీ సమయాన్ని ఆస్వాదించడం నాకు చాలా ఇష్టం. స్నేహితులతో గడపడం ఇష్టమే అయినా, నా కోసం నేను సమయం కేటాయించుకోవడంలో ప్రత్యేక ఆనందం ఉంటుంది. ఆ ఏకాంతం నాకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఎవరైనా నా జీవితంలోకి వస్తే వారితో గడపడానికి సిద్ధమే. కానీ ఎవరూ రాకపోయినా నేను ఒంటరిగా సంతోషంగా ఉండగలను అని రామ్ తెలిపాడు. సినిమా రంగంలో ఎప్పుడూ వందలాది మందితో కలిసి పని చేయాల్సి వస్తుందని, అయినా కూడా తనకు ప్రత్యేకమైన వ్యక్తిగత ప్రపంచాన్ని ఏర్పరచుకున్నానని చెప్పాడు. ముఖ్యంగా కరోనా లాక్డౌన్ సమయంలో దాదాపు ఏడాదిన్నర పాటు ఒంటరిగానే గడిపానని వెల్లడించాడు.
రామ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఆయన ఆలోచనలను సమర్థిస్తుండగా, మరికొందరు పెళ్లిపై ఇలా స్పందించడం ఆశ్చర్యంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే, ‘ఆంధ్రాకింగ్ తాలుకా’ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న రామ్, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజ్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన ఒక దర్శకుడితో ఈ సినిమా రూపొందనున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.