ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఎప్పుడూ ప్రయోగాలకు సిద్ధంగా ఉంటారు. కొత్త జోనర్ చిత్రాల్ని పరిచయం చేస్తుంటారు. ఇద్దరమ్మాయిల ప్రేమకథతో ఆయన ‘మా ఇష్టం’ చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. నైనా గంగూలీ, అప్సరరాణి ప్రధాన పాత్రల్ని పోషించారు. ఈ నెల 6న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు రామ్‌గోపాల్‌వర్మ. ఈ సందర్భంగా ‘ఆస్క్ ఏనీథింగ్’ పేరుతో హైదరాబాద్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో రామ్‌గోపాల్‌వర్మతో పాటు చిత్ర నాయికలు పాల్గొన్నారు. విద్యార్థులతో జరిపిన ముఖాముఖిలో వారు అడిగిన పలు ప్రశ్నలకు రామ్‌గోపాల్‌వర్మ సమాధానాలిచ్చారు. ఇది ఇద్దరు మహిళల మధ్య సాగే ఘాటు ప్రేమకథ అని చెప్పారు. ఈ చిత్రాన్ని తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించారు.