Ramcharan | రామ్‌చరణ్ ప్రస్తుతం పుత్రికోత్సాహంలో మునిగి తేలుతున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా తండ్రిగా తన అనుభవాలను పంచుకున్నారాయన. క్లింకార ఆగమనంతో తన ఇల్లు ఆనందాల నందనవనంగా మారిందని రామ్‌చరణ్ అంటున్నారు. ఇంకా చెబుతూ ‘అప్పుడే క్లింకార పుట్టి ఏడాది కావస్తోంది. రోజులన్నీ క్షణాల్లా గడిచిపోతున్నాయి. క్లింకార, ఉపాసనల బంధం చూస్తుంటే ముచ్చటేస్తుంది. క్లింకారే లోకంగా బతుకుతున్నది ఉపాసన. అలా బతకడం తల్లికి మాత్రమే సాధ్యం.
క్లింకార ఇప్పుడిప్పుడే మనుషుల్ని గుర్తుపడుతోంది. రోజూ తనకు అన్నం పెట్టేది నేనే. తనకు గోరుముద్దలు కలిపి పెట్టేటప్పుడు నాలో సూపర్‌పవర్స్ అవహిస్తాయి. రోజుకు రెండు సార్లు తనకి అన్నం కలిపి పెడతాను. నేను పెడితే గిన్నె ఖాళీ అయిపోవాల్సిందే.’ అంటూ తన కుమార్తె గురించి సంబరంగా చెప్పారు రామ్‌చరణ్.
ఇంకా మాట్లాడుతూ ‘ షూటింగ్స్‌కి వెళ్లినప్పుడు తనని ఎంతగానో మిస్ అవుతున్నాను. క్లింకార స్కూల్లో జాయిన్ అయ్యేంతవరకైనా తనతో ఎక్కువ సమయం గడిపేలా నా చిత్రాల షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోబోతున్నాను.’ అని తెలిపారు రామ్‌చరణ్. క్లింకారతో ఉన్నప్పుడు తన తండ్రి చిరంజీవి చిన్నపిల్లాడిగా మారిపోతారని, ‘నన్ను తాత అని పిలవకు.. చిరుత అని పిలువ్..’ అంటూ మురిసిపోతారని ఆనందం వెలిబుచ్చారు రామ్‌చరణ్.