అగ్ర కథానాయకుడు రామ్‌చరణ్ నటిస్తున్న పానిండియా రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రియులంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పానిండియా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే విజువల్ వండర్‌గా దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వెంకట సతీశ్ కిలారు నిర్మాత. ఈ నెల 18న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని ముంబయిలో ఘనంగా విడుదల చేయనున్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ఇందులో ‘మీర్జాపూర్’ఫేం దివ్యేందుశర్మ పోషిస్తున్న ‘రామ్ బుజ్జి’ పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియోను శుక్రవారం మేకర్స్ విడుదల చేశారు. క్రికెట్ మైదానంలో రామ్‌బుజ్జి ఎంట్రీ ఇచ్చిన తీరు, అతని బాడీ లాంగ్వేజ్, రగ్గ్డ్ యాటిట్యూడ్.. ఇవన్నీ పాత్రలోని ఇంటెన్సిటీని, కథలోని ప్రాముఖ్యతను ఆవిష్కరిస్తున్నాయి.
జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు, సంగీతం: ఏఆర్ రెహమాన్, సమర్పణ: మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, నిర్మాణం: వృద్ధి సినిమాస్.