రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 15వ సినిమా కొత్త షెడ్యూల్‌కు సన్నాహాలు చేసుకుంటున్నది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందిస్తున్నారు. కియారా అద్వానీ నాయిక. కొద్ది రోజులుగా చిన్న విరామం తీసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలో షూటింగ్‌కు రెడీ అవుతున్నది. తాను దర్శకత్వం వహిస్తున్న ‘ఇండియన్ -2’తో సమాంతరంగా రామ్ చరణ్ సినిమా చిత్రీకరణ జరుపుతామని ఇటీవల శంకర్ ప్రకటించారు. వచ్చే నెల మొదటి వారం నుంచి ఆర్సీ 15 కొత్త షెడ్యూల్‌కు వెళ్తున్నారు. ఈ షెడ్యూల్ భారీగా ఉంటుందని, దీంతో సినిమా చిత్రీకరణ దాదాపు ముగించేస్తారని సమాచారం. ఈ సినిమా రూపకల్పనతో పాటు సినిమా ప్రచార కార్యక్రమాలనూ ప్లాన్ చేస్తున్నారట. సామాజిక అంశాలు మేళవించిన రాజకీయ నేపథ్య కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నది.