Rakul Preet Singh | టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ‘కెరటం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్, వరుస విజయాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించింది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘లక్ష్యం’, ‘సరైనోడు’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధ్రువ’ వంటి సూపర్ హిట్స్‌తో టాలీవుడ్లో టాప్ రేంజ్లో నిలిచింది. అయితే ఈ మధ్య రకుల్‌కి టాలీవుడ్లో అవకాశాలు కరువయ్యాయి.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రకుల్, తన కెరీర్‌ను మలుపు తిప్పిన ఘటనను బహిరంగంగా వెల్లడించింది. మహేష్ బాబు – ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పైడర్’ లో రకుల్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. అయితే భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది.దీని గురించి మాట్లాడిన రకుల్ టాలీవుడ్లో నాకు వరుసగా ఎనిమిది, తొమ్మిది హిట్స్ వచ్చాయి. ‘స్పైడర్’ నా కెరీర్లో వచ్చిన తొలి పెద్ద డిజాస్టర్. ఆ ఒత్తిడిని మానసికంగా తట్టుకోలేకపోయాను. నాపై వచ్చిన విమర్శలు, నెగెటివ్ ఎనర్జీ నాకు బాగా తగిలాయి. అందుకే టాలీవుడ్ నుంచి దూరంగా వెళ్లాలని నిర్ణయించుకున్నాను.” అని చెప్పుకొచ్చింది.
‘స్పైడర్’ ఫెయిల్యూర్ తర్వాత తనకు వచ్చిన అనేక అవకాశాలను కూడా తానే తిరస్కరించినట్లు రకుల్ వెల్లడించింది. తెలుగులో తగ్గిన అవకాశాల తర్వాత ఆమె బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. అయ్యారీ, దేవ, డే డే ప్యార్ డే, థ్యాంక్ గాడ్, ఛత్రీవాలీ వంటి సినిమాలతో ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజీగా మారింది. పలు పాన్ ఇండియా బ్రాండ్లకు అంబాసడర్‌గా, డిజిటల్ ప్రాజెక్టుల్లోనూ ఆమె ఆదరణ పొందుతోంది. రకుల్ ప్రీత్ చేసిన వ్యాఖ్యలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ‘స్పైడర్’ ప్రభావం ఎంత తీవ్రంగా రకుల్‌ను దెబ్బతీసిందో నెటిజన్లు వివిధ కోణాల్లో చర్చిస్తున్నారు.