Raju weds Rambai | ఇటీవల కొన్ని చిన్న సినిమాలు అశేష ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. పెద్ద హంగామా లేకుండా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాలు కేవలం మౌత్ టాక్‌తోనే మంచి హిట్ సాధిస్తున్నాయి. ఆ కోవలోకే వస్తుంది ‘రాజు వెడ్స్ రాంబాయి’ . అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిన్న సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద సెన్సేషన్ . విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు లేకపోయినా, ప్రేక్షకాదరణతో రోజురోజుకూ భారీ విజయాన్ని నమోదు చేస్తోంది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషన్స్‌తో నిండిన ఈ గ్రామీణ ప్రేమకథ ప్రేక్షకుల హృదయాలను కదిలించడంతో, వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా అద్భుతమైన రన్‌ను కనబరుస్తోంది.
విడుదలైన మొదటి రోజే సినిమాకు మంచి మౌత్ టాక్ లభించింది. తొలి రోజు ₹1.40 కోట్లు కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం మూడు రోజుల్లోనే గ్రాస్ కలెక్షన్స్ ₹7 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ క్రమంలో ‘రాజు వెడ్స్ రాంబాయి’ తక్కువ బడ్జెట్‌తో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలిచింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో కూడా ఈ సినిమా మరింత పెరిగిన వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి. వసూళ్లు, ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణ మూవీ టీమ్‌ని ఆనందంలో ముంచేశాయి. తమపై చూపుతున్న ప్రేమకు కృతజ్ఞతగా ఓ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు నిర్మాతలు.
“మా రాంభాయ్ కథ.. ప్రతి మహిళ కోసం” అనే ట్యాగ్‌లైన్‌తో టీమ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీనిలో భాగంగా ఆంధ్రా మరియు సీడెడ్ ప్రాంతాలలో ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో మహిళలు ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాను పూర్తిగా ఉచితంగా చూడొచ్చు అని ప్రకటించారు. ఇది ప్రేక్షకులకు ఓ థ్యాంక్స్ గిఫ్ట్‌గానే కాకుండా, సినిమాలోని ‘రాంభాయి’ పాత్ర మహిళలకు ఇచ్చే ప్రేరణను సెలబ్రేట్ చేసే ప్రయత్నమని వివరించారు. టీమ్ ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రదర్శనలు అందించే థియేటర్ల పూర్తి జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాల ప్రధాన సెంటర్లు, సీఎస్ఆర్ గాలరీలు, టౌన్ A & B సెంటర్లలోని ఎన్నో థియేటర్లు చేర్చబడ్డాయి. ప్రత్యేక ఆఫర్‌కి కారణం సినిమాలోని కథ మహిళల భావోద్వేగాలు, సమస్యలు, ధైర్యం చుట్టూనే తిరుగుతుంది. అందుకే మహిళలు పెద్ద సంఖ్యలో సినిమా చూడాలని తాము కోరుకుంటున్నామని, అందుకే ప్రత్యేక ఉచిత ప్రదర్శనలు ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే ఈ ఆఫర్ నేడు ఒక్క రోజు మాత్రమే. థియేటర్స్ లిస్ట్ చూస్తే..
విశాఖపట్నం: శ్రీ కన్య, జగదాంబ
విజయనగరం: కృష్ణ
శ్రీకాకుళం: సూర్య మహల్
రాజమండ్రి: ఊర్వశి కాంప్లెక్స్
కాకినాడ: పద్మ ప్రియ కాంప్లెక్స్
ఏలూరు: అంబికా కాంప్లెక్స్
తణుకు: శ్రీ వెంకటేశ్వర
మచిలీపట్నం: సిరి కృష్ణ
విజయవాడ: స్వర్ణ కాంప్లెక్స్
గుంటూరు: బాలీవుడ్
ఒంగోలు: గోపి
నెల్లూరు: సిరి మల్టీప్లెక్స్
కావలి: లత, మానస
చిత్తూరు: గురునాథ్
హిందూపురం: గురునాథ్
తిరుపతి: జయ శ్యామ్
నంద్యాల: నిధి
కర్నూలు: ఆనంద్
కడప: రవి
రాయచోటి: సాయి
అనంతపురం: SV సినీ మాక్స్