మూడుపదుల వయసు దాటినా వన్నె తరగని అందంతో వెలిగిపోతున్నది సీనియర్ కథానాయిక తమన్నా. ప్రస్తుతం ఈ భామ చేతినిండా సినిమాలున్నాయి. దక్షిణాదితో పాటు హిందీలో కూడా భారీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ బిజీగా ఉంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన తమన్నా నటిస్తున్న ‘జైలర్’ చిత్రం ఇటీవలే షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రజనీకాంత్ ఈ సొగసరికి ఓ విలువైన బహుమతిని అందించాడట. రాఘవేంద్రస్వామి విగ్రహంతో పాటు ఓ ఆధ్యాత్మిక పుస్తకాన్ని తమన్నా బహుమతిగా అందుకుంది. తనతో కలిసి పనిచేసిన సహనటులకు బహుమతుల్ని ఇవ్వడం రజనీకాంత్ ఓ సంప్రదాయంలా పాటిస్తున్నారు. ఈ సందర్బంగా తమన్నా మాట్లాడుతూ ‘నా జీవితంలో విలువైన బహుమతి ఇది. రజనీకాంత్ సంతకం చేసిన ఆ పుస్తకం నుంచి ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నా’ అని పేర్కొంది.