Jailer Movie Record | దాదాపు పుష్కర కాలం తర్వాత రజనీ జైలర్‌తో హిట్టు కొట్టాడు . హిట్టంటే మళ్లీ ఆశా మాశీ హిట్టు కాదు. విక్రమ్, పొన్నియన్ సెల్వన్ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలను పదిరోజల్లోనే దాటేశాడు. నిజానికి రోబో తర్వాత ఇప్పటివరకు రజనీకి ఆ స్థాయి హిట్టు పడలేదు. మధ్యలో బాగా హైప్‌తో రిలీజైన ‘కబాలి’, ‘2.0’, ‘పేట’ సినిమాలు బాగానే ఆడినా రజనీ స్థాయిలో బంపర్ హిట్టు కొట్టలేకపోయాయి. ఇక గతేడాది వచ్చిన పెద్దన్న రజనీ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో రజనీ పనై పోయింది. సినిమాలకు ఇంకా సెలవు తీసుకుని టైమ్ వచ్చింది అని బోలెడు విమర్శలు వచ్చాయి. కట్ చేస్తే జైలర్‌తో విమర్శకుల నోటితోనే ప్రశంసలు అందుకున్నాడు. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది అనే రేంజ్లో సూపర్ స్టార్ జైలర్‌తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఒక్క తమిళంలోనే కాదు తనకు సాలిడ్ మార్కెట్ ఉన్న తెలుగులోనూ మాస్ కంబ్యాక్ ఇచ్చాడు.
తాజాగా కేవలం పది రోజుల్లోనే ఈ సినిమా రూ.500 కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది. పుష్కరకాలంగా హిట్టు చూడని ఒక హీరో.. అలాంటి అరుదైన మైలు రాయిని అందుకుంటాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఈ లెక్కలు చూసి ట్రేడ్ సైతం ఆశ్చర్యపోతుందంటే రజనీ ఏ రేంజ్లో వీర విహారం చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇక సౌత్ ఇండియాలో ఇలా రూ.500 కోట్ల మైలు రాయిని రెండు సార్లు అందుకున్న హీరోగా రజనీ నిలిచాడు. తొలిస్థానంలో ప్రభాస్ బాహుబలి1,2 సినిమాలతో లీడ్‌లో ఉన్నాడు. ఇక రజనీ గతంలో రోబో 2.ఓ సినిమాతో తొలిసారి ఈ మార్కును అందుకున్నాడు. ఫైనల్ రన్లో ఈ సినిమా రూ.800 కోట్ల మార్కును అందుకుంది. జైలర్ స్పీడ్ చూస్తుంటే ఆ రికార్డు కూడా తుడుచుకుపట్టు పోయేలా కనిపిస్తుంది.
ఒక్క తమిళంలోనే కాదు జైలర్ ప్రతీ చోట విధ్వంసమే కొనసాగిస్తుంది. తెలుగులో ఇప్పటికే రూ.70 కోట్ల మార్కును దాటేసి వంద కోట్ల దిశగా వెళ్తుంది. ఇక కన్నడలో ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్లలో టాప్ ప్లేస్‌లో నిలిచింది. మలయాళం, హిందీ భాషల్లోనూ వీర విహంగం చేసింది. ఇక కోలీవుడ్‌లో ఇప్పటికే రూ.200 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ వారం కూడా సౌత్ ఇండియన్ బాక్సాఫీస్‌లో పెద్దగా పోటీ లేకపోవడం జైలర్‌కు బాగానే కలిసొచ్చేలా కనిపిస్తుంది. ఈ చాన్స్ కనుక జైలర్ ఉపయోగించుకుంటే మట్టుకు తమిళనాట ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తుంది.