అగ్ర కథానాయకుడు రజనీకాంత్ అతిథి పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘లాల్ సలాం’. విష్ణువిశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్నది. సోమవారం ఈ సినిమాలోని రజనీకాంత్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన మొయిద్దీన్ భాయ్ పాత్రలో కనిపించనున్నారు.
ఫస్ట్‌లుక్‌లో ఆయన గెటప్ ఆకట్టుకునేలా ఉంది. ‘బాషా’ చిత్రంలో మాణిక్ బాషాగా ప్రేక్షకుల్ని మెప్పించిన రజనీకాంత్ ‘లాల్‌సలాం’ చిత్రంలో మొయిద్దీన్ భాయ్‌గా శక్తివంతమైన పాత్రలో కనిపిస్తారని చిత్రబృందం పేర్కొంది. క్రికెట్, కమ్యూనిజమ్ నేపథ్యంలో నడిచే కథ ఇదని, రజనీకాంత్ అతిథి పాత్ర ముంబయి నేపథ్యంలో ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విష్ణు రంగస్వామి, సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, నిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్, సమర్పణ: సుభాస్కరన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఐశ్వర్య రజనీకాంత్.