క్రికెట్, కమ్యూనిజమ్ నేపథ్యంలో రూపొందిస్తున్న ‘లాల్ సలామ్’ చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కీలకమైన అతిథి పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఆయన తనయ ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్నది. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలువడింది. లెజెండరీ క్రికెటర్, భారత్‌కు తొలిసారి ప్రపంచకప్‌ను అందించిన హర్యానా హరికేన్ కపిల్‌దేవ్ ‘లాల్ సలామ్’ చిత్రంలో రజనీకాంత్‌తో కలిసి నటించినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా కపిల్‌దేవ్‌తో కలిసి తీయించుకున్న ఫొటోను రజనీకాంత్ ట్విట్టర్లో పంచుకున్నారు. ‘లెజెండరీ పర్సన్. మనందరం గౌరవించే గొప్ప మనిషి కపిల్దేవ్గారితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. క్రికెట్ ప్రపంచకప్‌ను సాధించి దేశం గర్వపడేలా చేశారాయన’ అంటూ ఫొటోకు వ్యాఖ్యను జత చేశారు. కపిల్‌దేవ్ సైతం రజనీకాంత్‌తో కలిసి పనిచేయడం కొత్త అనుభూతినిచ్చిందని ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు.