Rajamouli | తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన ‘బాహుబలి: ది బిగినింగ్’ , ‘బాహుబలి: ది కన్‌క్లూజన్ సినిమాలు ఇప్పుడు ఒకే వెర్షన్‌గా ‘బాహుబలి: ది ఎపిక్ వెర్షన్’ టైటిల్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్స్ గురువారం (నేడు) రాత్రి నుంచే ప్రారంభం కానుండగా, అన్ని ఫార్మాట్లలో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కొద్ది రోజులుగా ‘ బాహుబలి: ది ఎపిక్ వెర్షన్’ చివర్లో బాహుబలి 3 పై ప్రకటన ఉంటుందంటూ ప్రచారం జోరుగా సాగింది. అయితే, నిర్మాత శోభు యార్లగడ్డ ఇప్పటికే ఈ రూమర్లపై క్లారిటీ ఇచ్చారు. బాహుబలి 3 ప్రాజెక్ట్ గురించి ఇంకా చాలా వర్క్ చేయాల్సి ఉందని, ప్రస్తుత ఎడిట్‌లో అలాంటి ఎలాంటి ప్రకటన లేదని ఆయన స్పష్టం చేశారు.
బాహుబలి 3 ప్రస్తావన లేకపోయినా, ఓ సర్ప్రైజ్ మాత్రం ఉండవచ్చని శోభు ఇటీవలే సూచించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అదేంటో తెలుసుకోవడానికి అందరూ ఎదురుచూస్తుండగా, ఇప్పుడు రాజమౌళి పరోక్షంగా దానిపై క్లారిటీ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ‘బాహుబలి: ది ఎపిక్’ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన రాజమౌళి, ప్రభాస్, రానా చిట్‌చాట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గంటకుపైగా నిడివి గల ఈ వీడియోలో సినిమా వెనుక జరిగిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఆ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, “‘ బాహుబలి: ది ఎపిక్’లో అవంతిక లవ్ స్టోరీ, కొన్ని పాటలు, కొన్ని సన్నివేశాలు కటింగ్‌లో తొలగించాం. కథాంశాన్ని మరింత సూటిగా చూపించడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం ” అని తెలిపారు. అలాగే, అందరూ బాహుబలి 3 వస్తుందని అనుకుంటున్నారని ప్రస్తావిస్తూ, “ అది కాదు” అని స్పష్టంచేశారు. కానీ, ఒక స్పెషల్ సర్ప్రైజ్ను మాత్రం కన్ఫర్మ్ చేశారు. రాజమౌళి వెల్లడించిన ప్రకారం, బాహుబలి ఎపిక్ వెర్షన్ ఇంటర్వెల్లో 3D యానిమేషన్ టీజర్ ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ టీజర్ ద్వారా బాహుబలి యూనివర్స్ కొనసాగనుందని చెప్పారు. ఈ యానిమేషన్ సీక్వెన్స్ దర్శకుడు ఇషాన్ శుక్లా రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో శోభు యార్లగడ్డ చెప్పిన ‘సర్ప్రైజ్’ ఇదే అయి ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు. అంటే, బాహుబలి వరల్డ్‌కి నూతన దిశలో ప్రారంభమయ్యే 3D యానిమేషన్ టీజర్‌నే ఆ సర్ప్రైజ్గా భావిస్తున్నారు. ఈ సర్ప్రైజ్ నిజమో కాదో తెలుసుకోవాలంటే థియేటర్‌కి వెళ్లాల్సిందే!