Vikramarkudu Sequel | మాస్ రాజ రవితేజ కెరీర్లో ‘విక్రమార్కుడు’ సినిమా ఒక సంచలనం. ‘భగీరథ’, ‘షాక్’ వంటి రెండు వరుస డిజాస్టర్ల తర్వాత వచ్చిన ఈ చిత్రం రవితేజను స్టార్ హీరోల సరసన నిలబెట్టింది. అప్పటివరకు రవితేజ మార్కెట్ 10 కోట్ల వరకు ఉండేది. ఈ చిత్రంతో ఏకంగా 20కోట్ల మార్కెట్ రవితేజకు ఏర్పడింది. ఈ చిత్రంలో రవితేజ యాక్టింగ్, రాజమౌళి టేకింగ్ వేరే లెవల్ ఉంటుంది. 11కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 19.50 కోట్లు షేర్ కలెక్షన్లను సాధించి బ్లాక్బాస్టర్ హిట్‌ను సాధించింది. ఈ చిత్రానికి కథ విజయేంద్రప్రసాద్ అందించాడు.
ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉండనుందని గతంలోనే విజయేంద్రప్రసాద్ వెల్లడించాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విజయేంద్రప్రసాద్ సీక్వెల్‌కు సంబంధించిన కథను పూర్తి చేసేపనిలో ఉన్నాడని సమాచారం. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలోను ఏకకాలంలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. కానీ ఈ సీక్వెల్‌కు రాజమౌళి దర్శకత్వం వహించడట. మరో దర్శకుడు ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. విక్రమార్కుడు సినిమాలో రవితేజ విక్రమ్ సింగ్ రాథోడ్, అత్తిలి సత్తిబాబుగా ద్విపాత్రాభినయంగా నటించాడు. అనుష్క హీరోయిన్గా నటించింది.