Raja Saab | ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజాసాబ్’కు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా విడుదలకు ముందే మేకర్స్‌కు గుడ్ న్యూస్ చెబుతూ, టికెట్ ధరలను పెంచుకునేందుకు అధికారికంగా అనుమతి ఇచ్చింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే నిర్మాతలు ఒకరోజు ముందుగానే గురువారం రాత్రి నుంచే ప్రీమియర్స్ షోలు నిర్వహించేందుకు అనుమతి కోరగా, ఆ అంశానికి మాత్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.అయితే ప్రీమియర్స్‌కు అనుమతి నిరాకరించినప్పటికీ, టికెట్ ధరల పెంపునకు మాత్రం తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత విడుదలైన ఈ జీవో ప్రకారం, జనవరి 9 నుంచి జనవరి 11 వరకు మూడు రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.105, మల్టీప్లెక్స్‌లలో రూ.132 మేర టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే జనవరి 12 నుంచి జనవరి 18 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.62, మల్టీప్లెక్స్‌లలో రూ.89 వరకు అదనంగా వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే ఈ పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతం ఫిలిం ఫెడరేషన్‌కు చెల్లించాలని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఈ నిర్ణయంతో ‘ది రాజాసాబ్’ మేకర్స్ ప్రభుత్వం అందించిన సహకారంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రానికి ఈ టికెట్ ధరల పెంపు కొంతవరకు ఊరట కలిగించిందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ హారర్–థ్రిల్లర్ ఎంటర్టైనర్ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో విడుదలపై మరింత ఆసక్తి పెరిగింది.