Raja Saab | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది రాజా సాబ్’. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ఓ మ్యూజికల్ సర్ప్రైజ్ అందించారు. ‘ది రాజా సాబ్’ సినిమా విడుదలకు ఇంకా ఎనిమిది రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్ మరింత వేగం పుంజుకున్నాయి.
క్రిస్మస్ స్పెషల్‌గా ‘రాజే యువరాజే’ సాంగ్ ప్రోమోను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేసిన మేకర్స్ న్యూ ఇయర్ గిఫ్ట్‌గా ఫుల్ ఆడియో సాంగ్ విడుదల చేశారు. ‘‘రాజే యువరాజే.. కొలిచేటి తొలి ప్రేమికుడే.. నడిపించేది అతడే’’ అంటూ సాగే ఈ మ్యూజికల్ సాంగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ఈసారి ఫ్రెష్ ట్యూన్‌తో మరోసారి మెస్మరైజ్ చేయనున్నాడని అర్థమవుతోంది. ‘ది రాజా సాబ్’ ఇండియాలోనే బిగ్గెస్ట్ హారర్ ఫాంటసీ మూవీగా రూపొందుతున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. ఇది ప్రభాస్ కెరీర్లోనే తొలి హారర్ జానర్ చిత్రం కావడం విశేషం. ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు మారుతి తెలిపారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరీనా వాహబ్, సముద్రఖని, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, వీటీవీ గణేష్, సత్య, సప్తగిరి, ప్రభాస్ శ్రీను, జిషు షేన్ గుప్తా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తుండగా, రామ్ లక్ష్మణ్, కింగ్ సోలొమన్ యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు. ‘ది రాజా సాబ్’ సినిమాను జనవరి 9న వరల్డ్‌వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించగా, రెబల్ స్టార్ అభిమానులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.