Raja Saab |ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం ‘ది రాజా సాబ్’ విడుదలైన మొదటి రోజు నుంచే మిక్స్డ్ స్పందన ఎదుర్కొంటోంది. కథ, కథనం విషయంలో ప్రేక్షకుల్లో పూర్తి స్థాయి సంతృప్తి కనిపించకపోవడంతో దర్శకుడు మారుతి పనితీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. పాన్ ఇండియా స్టార్‌తో సినిమా చేసినా, కంటెంట్ ఆశించిన స్థాయిలో లేదన్న అభిప్రాయం సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. ఈ విమర్శలు క్రమంగా ట్రోలింగ్‌గా మారి, ఇప్పుడు మరింత తీవ్రమైన దిశలోకి వెళ్లడం చర్చకు దారితీసింది. సినిమాపై అసంతృప్తిని వ్యక్తపరచడం సోషల్ మీడియా వరకే పరిమితమవ్వకుండా, తాజాగా దర్శకుడు మారుతి వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేసే స్థాయికి చేరిందని సమాచారం.
హైదరాబాద్ కొండాపూర్‌లో ఆయన నివాసం ఉన్న లగ్జరీ విల్లా వద్ద అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మారుతి పేరుతో ఫుడ్ డెలివరీ యాప్‌ల ద్వారా పెద్ద ఎత్తున ఆర్డర్లు రావడం, అలాగే మెడికల్ షాప్‌కు సంబంధించిన ఆర్డర్లు కూడా చేరడంతో సెక్యూరిటీ సిబ్బంది గందరగోళానికి గురయ్యారు. ఒక్కరోజులోనే వందల సంఖ్యలో డెలివరీ బాయ్స్ రావడంతో పరిస్థితి అదుపు తప్పినట్టుగా మారిందని తెలుస్తోంది. ఈ ఘటనలపై విచారణ చేయగా, మారుతి తాను ఎలాంటి ఆర్డర్లు పెట్టలేదని స్పష్టం చేయడంతో విషయం ట్రోలింగ్ కోణంలోకి వెళ్లింది. చివరికి తన పేరుతో వచ్చే ఏ ఆర్డర్‌నైనా లోపలికి అనుమతించవద్దని ఆయన సెక్యూరిటీకి సూచనలు ఇచ్చినట్లు సమాచారం. సినిమా ఫలితంపై అసంతృప్తి వ్యక్తం చేయడం ఒక విషయం అయితే, ఇలా వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టడం సరైంది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా, ఈ మొత్తం వివాదానికి కారణం గతంలో మారుతి చేసిన ఒక వ్యాఖ్యేనన్న చర్చ కూడా నడుస్తోంది. ‘ది రాజా సాబ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో సినిమా మీద పూర్తి నమ్మకం వ్యక్తం చేసిన ఆయన, అభిమానులు అసంతృప్తి చెందితే తన ఇంటికే రావచ్చని సరదాగా వ్యాఖ్యానించారు. అప్పట్లో ఇది దర్శకుడి కాన్ఫిడెన్స్‌గా భావించినా, సినిమా విడుదల తర్వాత వచ్చిన మిక్స్డ్ టాక్ నేపథ్యంలో అదే మాటలు ఇప్పుడు సమస్యగా మారినట్లయ్యాయి.మరోవైపు ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఎస్కేఎన్ కూడా సోషల్ మీడియా ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. ఫేక్ అకౌంట్స్ ద్వారా తనను, సినిమా టీమ్‌ను అవమానిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. అధికారికంగా ఫిర్యాదు చేసి, దానికి సంబంధించిన ఆధారాలను సమర్పించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని తెలుస్తోంది.