Raja Saab | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న తాజా చిత్రం ‘రాజాసాబ్’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాపై మొదటి నుంచి మిశ్రమ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడటం, విడుదలైన టీజర్, ట్రైలర్లు పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోవడంతో ప్రేక్షకుల్లో, ముఖ్యంగా అభిమానుల్లో కూడా హైప్ అంతగా కనిపించడం లేదు. ఇదిలా ఉండగా, తాజాగా రాజాసాబ్ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర సమాచారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ కామెడీ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే షూటింగ్ సమయంలో తీసిన మొత్తం ఫుటేజ్‌ను కలిపితే దాదాపు నాలుగు గంటలకు పైగా వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. దీంతో ఎడిటింగ్ టేబుల్‌పై భారీ కత్తెర పడినట్లు తెలుస్తోంది.
ఎంత ఎడిటింగ్ చేసినా సినిమా నిడివి మూడు గంటల 15 నిమిషాల కంటే తక్కువకు రావడం కష్టమయ్యిందట. చివరికి దర్శకుడు మారుతి, ప్రభాస్ కలిసి చర్చించుకుని మూడు గంటల 10 నిమిషాల నిడివి వద్ద ఫైనల్ కట్‌ను లాక్ చేసినట్లు సమాచారం. ‘రాజాసాబ్’ ఒక హారర్ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో పాటు ప్రభాస్–హీరోయిన్లపై పాటలు, కామెడీ ట్రాక్స్ ఎక్కువగా ఉంటాయని టాక్. ఇలాంటి జానర్ సినిమాకు మూడు గంటల పది నిమిషాల నిడివి ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టగలదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో నాలుగు గంటలు, మూడున్నర గంటల సినిమాలు సాధారణంగా ఉండేవి. కానీ ఇప్పటి ప్రేక్షకుల అభిరుచులు పూర్తిగా మారిపోయాయి. గత కొంతకాలంగా మళ్లీ మూడు గంటలకు పైగా నిడివి ఉన్న సినిమాలు వస్తున్నప్పటికీ, అవి కంటెంట్ బలంగా ఉన్నప్పుడే ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.
రాజాసాబ్ సినిమాపై ప్రస్తుతం ఫ్యాన్స్ కూడా పెద్దగా అంచనాలు పెట్టుకోవడం లేదు. అయినప్పటికీ ప్రభాస్ స్టార్ పవర్, సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్ కలిసి వస్తే సినిమా ఎలా నిలబడుతుందో చూడాలి. ముఖ్యంగా మూడు గంటల నిడివి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించనుందా? లేక మారుతి కథనం, ప్రభాస్ కామెడీ టైమింగ్‌తో టైమ్ ఫ్లై అయిపోతుందా? అన్నది రిలీజ్ తర్వాతే తేలాల్సి ఉంది. మొత్తానికి, సంక్రాంతికి రాబోతున్న ‘రాజాసాబ్’ సినిమా నిడివి ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది. ఈ మూడు గంటల ప్రయాణం ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అవుతుందా? లేక భారంగా మారుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.