Radhika | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ తల్లి గీత ఆదివారం రాత్రి (సెప్టెంబర్ 21, 2025) 9.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 86 సంవత్సరాలు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.గీత మృతితో రాధిక కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భారత సినీ చరిత్రలో ఎంతో గుర్తింపు పొందిన దివంగత నటుడు ఎం.ఆర్. రాధ భార్యగా, కుటుంబాన్ని నడిపించడంలోను , వారసత్వాన్ని కొనసాగించడంలోను కీలక భూమిక పోషించారు. ఆమె తన జీవితాన్ని కుటుంబానికి అంకితం చేయడమే కాకుండా, పలు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ క్రియాశీలంగా పాల్గొన్నారు.
వెనుకబడిన వర్గాల అభివృద్ధికి గీత ఎంతో కృషి చేసినట్లు ఆమె సన్నిహితులు తెలియజేశారు. గీత అంత్యక్రియలు సెప్టెంబర్ 22న (సోమవారం) సాయంత్రం 4.30 గంటలకు చెన్నై బెసెంట్ నగర్ శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గీత మృతి పట్ల సినీ పరిశ్రమతో పాటు, రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినీ ప్రముఖులు, అభిమానులు, రాజకీయ నాయకులు భారీగా గీత నివాసానికి చేరుకుంటూ రాధిక కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు. ఆమె అందించిన సేవలకు గుర్తుగా ఆమె జ్ఞాపకాలు ఎన్నటికీ మరవలేనివిగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు.
ఇక రాధిక విషయానికి వస్తే.. ఒకప్పుడు టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రాధిక.. భారతిరాజా దర్శకత్వం వహించిన తమిళ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ తర్వాత తెలుగు పరిశ్రమలోకి వచ్చిన రాధిక, తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో కూడా నటించి మెప్పించింది. రాధిక ఎక్కువగా తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించగా, చిరంజీవితో కూడా చాలా సినిమాలు చేసింది.. ఇక ఈ మధ్య హీరోయిన్ గా సినిమాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతుంది రాధిక. ప్రస్తుతం యంగ్ హీరోలకు తల్లి పాత్రలు చేస్తున్నారు. నటిగా మాత్రమే కాదు నిర్మాతగా, రాజకీయ రంగంలోనూ ఆమె సత్తా చాటారు.