‘విద్య, వైద్యాన్ని జాతీయం చేయాలనే అంశాన్ని ఈ సినిమాలో చర్చించాం. గొప్ప సామాజిక సందేశంతో ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది’ అన్నారు. ప్రము ఖ నటుడు, దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి. స్నేహ చిత్ర పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఆయన రూపొందించిన చిత్రం ‘యూనివర్సిటీ’ ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మంగళవారం ప్రివ్యూ షోను ఏర్పాటు చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ ‘మనది నిరుద్యోగ భారతం కాదు..ఉద్యోగ భారతం కావాలి అనే గొప్ప సందేశాన్ని ఈ సినిమాలో చాటి చెప్పాం.
ఇందులో ఐదు పాటలుంటాయి. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నా’ అన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ ‘ప్రజల్లో సామాజిక స్పృహను పెంపొందించే చిత్రమిది. సమాజంలో జరుగుతున్న యథార్థ సంఘటనల్ని ఈ సినిమాలో చూపించారు’ అని పేర్కొన్నారు. విద్య ప్రైవేటీకరణ తాలూకు దుష్ప్రభావాల్ని ఈ సినిమాలో చక్కగా ఆవిష్కరించారని ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ తెలిపారు.