Pushpa 2 | గత కొద్ది వారాలుగా దేశం మొత్తం, అన్ని భాషల్లో ఎక్కడ చూసినా ‘పుష్ప -2’ చర్చనే నడుస్తున్నది.. ‘పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా.. కాదు వైల్డ్ ఫైర్’ అని ట్రైలర్లో చూపించిన డైలాగ్ తరహాలోనే పుష్పరాజ్ మేనియా ఓ దావానంలా వ్యాపించింది.. అందుక్కారణం పార్ట్-1లో పుష్పరాజ్ పాత్ర క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అని చెప్పొచ్చు.. ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌కి పుష్పరాజ్ బాగా చేరువయ్యాడు.. దీనితోపాటు ‘పుష్ప’ బాక్సఫీస్ వద్ద అద్భుత విజయం సాధించటం, అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకోవడంతో ‘పుష్ప -2’పై అంచనాలు ఆకాశాన్నంటాయి. పాట్నా మొదలుకొని మొన్నటి హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు చిత్ర బృందం దూకుడుగా చేసిన ప్రమోషనల్ కార్యక్రమాలు సినిమాపై మరింత క్రేజ్‌ని పెంచాయి…
ఇక విడుదలకు ముందే అనేక రికార్డులు బద్దలుకొట్టింది పుష్ప 2. ప్రీ రిలీజ్, ప్రీ బుకింగ్స్ లో కొత్త రికార్డులు నెలకొల్పింది. ఆరు భాషల్లో 12 వేలకిపైగా థియేటర్లలో విడుదలైన ఏకైక తెలుగు సినిమాగా నిలిచింది.. మరి ఇన్ని భారీ అంచనాల మధ్య విడుదలైన ‘పుష్ప 2’ అంచనాలను అందుకున్నాడా? బాక్సాఫీసు బరిలో పుష్ప దూకుడు ఎలా ఉండబోతున్నది ? మూడేళ్ల అభిమానుల నిరీక్షణకు తగిన ప్రతి ఫలం దక్కిందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే..
ఎర్రచందనం సిండికేట్‌కు తిరుగులేని నాయకుడిగా ఎదిగిన పుష్ప రాజ్ (అల్లు అర్జున్) భార్య శ్రీవల్లి (రష్మిక మందన)తో కలసి హాయిగా జీవితం సాగిస్తుంటాడు.. ఓ రోజు తన ఊర్లోకి ముఖ్యమంత్రి పర్యటనకు వస్తాడు. సీఎంని కలవడానికి వెళ్తున్న పుష్పని ఆయనతో ఓ ఫోటో దిగమని కోరుతుంది శ్రీవల్లి. అయితే అక్కడ పుష్పరాజ్‌కి అవమానం ఎదురవుతుంది.. ఒక స్మగ్లర్‌తో ఫోటో దిగడమా? అని సీఎం హేళన చేస్తాడు. దీంతో ఈగో హర్ట్ అయిన పుష్పరాజ్ మఖ్యమంత్రినే మార్చేయాలని గట్టి నిర్ణయించుకుంటాడు. అయితే దానికి చాలా డబ్బు కావాలి. అందుకోసం ఎన్నో వ్యూహాలను రచించాల్సి ఉంటుంది.. మరి ఆ డబ్బు కోసం పుష్పరాజ్ ఏం చేశాడు? అతని ప్రయత్నాలను పోలీస్ ఆఫీసర్ షెకావత్ (ఫాహాద్ ఫాజిల్) ఎలా అడ్డుకున్నాడు? తన ఇంటి పేరు కోసం పోరాడుతున్న పుష్పకి ఆ పేరు దక్కిందా? చివరకు పుష్పరాజ్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకునే క్రమంలో వేసిన ఎత్తుగడలు ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే మిగతా కథ.. ఇక దాన్ని తెరపై చూడాల్సిందే…
ఎర్రచందనం కూలీ నుంచి స్మగ్లింగ్ సిండికేట్‌కు లీడర్‌గా పుష్ప ఎదిగిన వైనాన్ని పుష్ప ది రైజ్‌లో చూశాం. సిండికేట్‌కు లీడర్ అయ్యాక పుష్పరాజ్ ఆధిపత్యం ఎలా సాగిందనే అంశాన్ని ఈ రెండో భాగంలో ఆవిష్కరించారు.. జపాన్ పోర్ట్ యాక్షన్ సీక్వెన్స్‌తో కథ మొదలౌతుంది. ఫ్యాన్స్ ఎలాంటి ఎంట్రీ కోరుకుంటారో అంతలా మాస్ ని మెస్మరైజ్ చేస్తూ పుష్ప తెరపైకి రావడం అలరిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఎక్కువగా హీరో రైజ్ పై ద్రుష్టి పెడుతూ, హీరోయిజాన్ని హైలట్ చేస్తూ ముందుకు సాగుతోంది. సీఎం ఫోటో ఎపిసోడ్ బాగా కుదిరింది.
ఫస్ట్ హాఫ్‌లో ఎక్కువ శాతం పుష్ప క్యారెక్టర్ చుట్టూ డ్రామాని అల్లుకున్నాడు దర్శకుడు. అయితే డ్రామా ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. దీనికి కారణం.. అల్లు అర్జున్ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్. పుష్ప క్యారెక్టర్ని డిజైన్ చేసిన తీరు అంత బాగా కుదిరింది. ఇంటర్వెల్లో అసలు సిసలు కాన్ఫ్లిక్ట్ పాయింట్ తెరపైకి వస్తుంది . పుష్పరాజ్, పోలీస్ ఆఫీసర్ షెఖావత్ పాత్రల మధ్య వచ్చే సవాల్ సెకండ్ హాఫ్‌పై అంచనాలు పెంచుతుంది.
చేజ్ సీక్వెన్స్‌తో మొదలైన సెకండ్ హాఫ్ తర్వాత వచ్చే జాతర ఎపిసోడ్‌తో పుష్ప ఇచ్చే అడ్రినలిన్ రష్ పతాక స్థాయికి చేరుతుంది. ఇక జాతర ఎపిసోడ్ హైలైట్‌గా చెప్పొచ్చు. ఇందులో యాక్షన్, డ్యాన్స్ అభిమానులు పండగ చేసుకునేలా వుంటుంది. టోటల్‌గా ఎపిసోడ్‌ని డిజైన్ చేసిన తీరు అద్భుతం అనిపిస్తుంది.. హై ఇంటెన్సిటీ యాక్షన్, ఎమోషన్స్‌తో ఆ ఎపిసోడ్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసింది.
అయితే ఒక దశలో కథ కాస్త పక్కకు జరిగి ఎపిసోడ్స్ పైనే కథనాన్ని నడిపిస్తున్న భావన కలుగుతుంది. అయితే సుకుమార్ ఇక్కడే తన స్క్రీన్ రైటింగ్‌తో మేజిక్ చేశారు.. పుష్పలోని మరో కోణాన్ని చూపిస్తూ హీరోయిజాన్ని నెక్స్ట్ లెవల్లో ఎలివేట్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ ఎపిసోడ్స్, మాస్ ఎలివేషన్స్ పక్కా కమర్షియల్ కొలతల్లో అమరాయి. ఇవన్నీ ఒక ఎత్తుఅయితే పుష్ప ర్యాంపేజ్ క్లిప్ హ్యంగర్ మూడో భాగంపై ఆసక్తిని పెంచింది.
పుష్ప క్యారెక్టర్ అల్లు అర్జున్ కెరీర్లో ఓ మైల్ స్టోన్. తొలి పార్ట్‌లో నటనకు జాతీయ అవార్డ్ అందుకున్న బన్నీ.. ఇప్పుడు పుష్ప ది రూల్ లో తన నట విశ్వరూపం చూపించాడు. తెరపై పుష్ప తప్పితే మరో క్యారెక్టర్ కనపడదు.. అంతటి స్క్రీన్ ప్రజెన్స్ తో అల్లు అర్జున్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కనబరిచాడు. మాస్ ఎలివేషన్స్, డైలాగ్ డిక్షన్స్, యాక్షన్, డ్యాన్స్ ఇలా అన్నిట్లో అభిమానులను మెప్పించాడు.. నిజంగానే పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనిపించాడు. జాతర ఎపిసోడ్లో బన్నీ నటన పతాక స్థాయికి చేరింది.
రష్మిక తనదైన అభినయంతో అలరించింది. పుష్పరాజ్, శ్రీవల్లి మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓ సందర్భంలో రష్మిక చెప్పే నాన్ స్టాప్ డైలాగ్ ఆకట్టుకునేలా వుంటుంది. ఫాహాద్ ఫాజిల్ మరోసారి తన నేచురల్ పెర్ఫార్మెన్స్తో కట్టిపడేశాడు. పుష్ప, ఫాహద్ మధ్య వచ్చే సీన్స్ అద్భుతంగా కుదిరాయి. జగపతి బాబు, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్ తమ పరిధుల మేరకు న్యాయం చేశారు. ఇక శ్రీలీల కిస్సిక్ డ్యాన్స్ నెంబర్ ఆడియన్స్‌కి బోనస్. బన్నీతో పోటీపడి మరీ డ్యాన్స్‌తో అదరగొట్టింది.
సాంకేతికంగా సినిమా అత్యున్నతంగా వుంది. ప్రతి క్రాఫ్ట్ లో రిచ్ నెస్ కనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ పాటలు వినడానికి చూడటానికి విజువల్ ఫీస్ట్‌లా వున్నాయి. కిస్సిక్, పీలింగ్స్ పాటలకు థియేటర్స్‌లో విజిల్స్ మోత మోగించాయి. జాతర సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఆ సాంగ్‌లో బన్నీ డ్యాన్సులు వేరే లెవల్. నేపథ్య సంగీతం కొన్ని చోట్ల పూనకం తెప్పించేలా వుంది. క్యూబా కెమెరా పనితనం నెక్స్ట్ లెవల్లో వుంది. పుష్ప ప్రపంచాన్ని మరింత గ్రాండియర్‌గా చూపించాడు.
ఎడిటింగ్ కాస్త షార్ప్‌గా ఉండాల్సింది. కొన్ని సాగదీత సన్నివేశాలు వున్నాయి. ఎస్. రామకృష్ణ – మోనికా నిగోత్రే ప్రొడక్షన్ డిజైన్ టాప్ క్లాస్‌లో తెరపై కనిపించింది. సుకుమార్‌లో డైలాగ్ రైటర్ చాలా చోట్ల మెరుస్తాడు. ‘పుష్ప అంటే నేషనల్ అనుకుంటిరా.. ఇంటర్నేషనల్’, ‘పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్’ డైలాగ్స్ ప్లేస్మెంట్ బాగా కుదిరింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు పెంచేలా అనిపించాయి.. ఇప్పటికే నెలకొన్న హైప్ దృష్ట్యా పుష్పరాజ్ బాక్సఫీస్ జైత్రయాత్రకు ఇక ఎదురు ఉండదనే అనిపిస్తున్నది.. ఈ లాంగ్ వీకెండ్ లో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఫైనల్ పంచ్: పుష్ప రాజ్ మాస్ జాతర
రేటింగ్: 3.5/5