Puri Jagannadh | అగ్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ మరో కొత్త పాడ్ కాస్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూరి మ్యూజింగ్స్ (Puri Musings) అనే పేరుతో పూరీ తన భావాలను వివిధ అంశాలపై మాట్లాడుతుంటాడు అన్న విషయం తెలిసిందే. ఈ విషయాలను యూట్యూబ్ వేదికగా అప్లోడ్ చేస్తూ ఉంటాడు. దీనికి ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ ఉంది. తాజాగా షేరింగ్ ప్రాబ్లమ్స్ (Sharing Problems) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
జీవితంలో మనకు ఏవేవో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి.. వాటి గురించి ఆలోచిస్తూ మీరు దిగులు చెందుతారు. మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఏంటి అలా ఉన్నావ్ ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్పవచ్చు కదా అంటారు. ఇలా అడిగినప్పుడు దయచేసి చెప్పకండి. ఎందుకంటే అందరూ మన ప్రాబ్లమ్స్‌ని అర్థం చేసుకోలేరు. వాళ్లు సానుభుతితో అడగరు.. క్యూరియాసిటీతో అడుగుతారు. మీ జీవితంలో ఏం జరుగుతుందో వాళ్లు తెలుసుకోవాలి. అదో తృప్తి వాళ్లకి. భుజం మీద చెయ్యి వేసి చాలా ఫ్రెండ్లీగా అడుగుతారు. అది నిజమే అనుకోని మీ పర్సనల్ విషయాలు వాళ్ళకి చెప్పవద్దు. మొత్తం అంతా విని మిమ్మల్ని అర్థం చేసుకోవడం
మానేసి పైగా అపార్థం చేసుకుంటారు. మీరు ఏడుస్తూ బాధలు చెప్పుకుంటూ ఉంటే.. వాళ్ళ మైండ్‌లో ఇంకొన్ని యాడ్ చేసి వేరే వాళ్ళకి ఈ కథ ఎలా చెప్పాలా అని ప్రిపేర్ అవుతుంటారు.
లోపల వాళ్ళకి ఒక గాసిప్ విషయం దొరికిందని ఆనందంలో ఉంటారు. కానీ పైకి మాత్రం మీ మీద ఎంతో ఆందోళన చూపిస్తూ మీలాంటి మూడ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్లు మీకు సహాయం చేయకపోగా.. మీ కథ ఊరంతా చెబుతాడు. ఇక్కడ అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన సమస్యలను ఇతరులతో షేర్ చేసుకోవడం అనేది ఎప్పటికి మంచి ఐడియా కాదు. క్రిటికల్ ప్రాబ్లమ్‌ని చెబుతున్నప్పుడు అవతలి వాళ్ల నుంచి కూడా ఒక ఎమోషనల్ ఎఫర్ట్ కావాలి.
ఒక్కోసారి ప్రాబ్లమ్ వినేవాడు మీరు అనుకున్నట్టు రియాక్ట్ అవ్వకపోతే మీకు కోపం రావచ్చు. ఒకవేళ అవతలి వ్యక్తి నిజంగానే మంచోడు అనుకోండి మీ కష్టాలన్నీ చెప్పి వాళ్ళ మీద బరువును ఎందుకు వేయడం. ఏదైనా మన కష్టాలు అందరితో షేర్ చేయడం వల్ల ఉపయోగం లేదు. ఇలాంటివి తప్పుగా అర్థం చేసుకోవడం లేదా గాసిప్‌లు వెళతాయి. మీ ప్రాబ్లమ్స్ మీరే సాల్వ్ చేసుకోవడం వల్ల మీరు ఎమోషనల్‌గా బలంగా తయరవుతారు. మీ ప్రాబ్లం గురించి మీకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలిదు.
దాని సమాధానం కూడా మీకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలిదు. ఆ మాత్రం దానికి వేరే వాళ్ళ మీద ఆధారపడం దేనికి. మీకు లీగల్ ప్రాబ్లం వస్తే మీ లాయర్ని అడగండి.. హెల్త్ ప్రాబ్లం వస్తే డాక్టర్‌ను అడగండి. మెంటల్ ప్రాబ్లం వస్తే థెరపిస్ట్‌ని అడగండి. డబ్బు కావాలంటే ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకోండి. అంతే తప్ప మీ సమస్యలను అందరికీ చెప్పడం వలన ఉపయోగం లేదు.
మన చుట్టూ ఉన్నోళ్లే కాదు మనం కూడా చాలాసార్లు అవతల వాళ్ళ సమస్యల్ని కథలుగానే వింటాం. వాళ్లకి ఎలాంటి సహాయం చేయం. ఇదే పని అందరూ చేస్తారు. అందుకే మన కష్టాలు మనలోనే దాచుకుందాం ప్రతి తుఫానుని ప్రసారం చేయాల్సిన పనిలేదు. కొన్ని తుఫానులను మనలోనే దాచుకోవాలి. తుఫాను దాచే శక్తి మీలో ఉంటే మీరు జీవితంలో మరింత శక్తివంతం అవుతారు. అంటూ పూరి చెప్పుకొచ్చాడు.