వరుస సినిమాలతో ప్రేక్షకులని అలరించే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ఆయన నటించిన సూర్యవంశీ చిత్రం తాజాగా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో బాలీవుడ్లో జోష్ వచ్చింది. సూర్యవంశీ చిత్రం తర్వాత పలు హిందీ చిత్రాలను థియేటర్స్లో విడుదల చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.
అయితే సూర్యవంశీ చిత్రానికి పంజాబ్ రైతుల సెగ తగిలింది. కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలను రద్దు చేయాలంటూ పంజాబ్ రైతులు చాలా కాలంగా ఉద్యమం చేస్తున్నారు. ఎన్ని అవాంతరాలొచ్చినా వారు మాత్రం ఉద్యమాన్ని ఆపలేదు. ఈ క్రమంలో పంజాబ్ లో కూడా అక్షయ్ కుమార్ సూర్యవంశి సినిమా విడుదలైంది. రైతు చట్టాలకు మద్దతివ్వకుండా మా ప్రాంతంలో సినిమా ఎలా విడుదల చేస్తారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంజాబ్ లోని హోషియార్ పూర్ లో సినిమా ఫ్లెక్సీలు చించేసి నానా హంగామా చేశారు. రైతు చట్టాలను రద్దు చేసే వరకు ఆ సినిమాని ఆడనివ్వబోమంటూ ఎదురు తిరిగారు. ఎవరి సినిమా ప్రదర్శన జరిగినా మేం ఇంతే చేస్తామంటూ రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికే కరోనా వలన నానా కష్టాలు ఎదుర్కొన్న బాలీవుడ్ సినీ పరిశ్రమకు ఇదొక సమస్యగా మారింది. ఇందులో అక్షయ్ తొలి బాధితుడు కాగా, రానున్న రోజులలో ఇంకెంత మంది స్టార్స్ పంజాబ్ రైతుల ఆగ్రహానికి గురవుతారో చూడాలి.