Puneeth Rajkumar | కన్నడ దివంగత నటుడు పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గురించి తెలుగు వారికి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కొంత మంది ఫ్యాన్స్ అయితే ఆయన్ను ఓ దేవుడిలా కొలుస్తున్నారు. అయితే అప్పు అని ప్రేమగా పిలుచుకునే ఈ కన్నడ సూపర్ స్టార్ చనిపోయి ఈ రోజుతో రెండేళ్లు గడిచింది. దీంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు పునీత్ రాజ్ కుమార్‌కు నివాళులు అర్పిస్తున్నారు. మరోవైపు బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలోని పునీత్ సమాధి దగ్గర ఈరోజు జరగనున్న పూజా కార్యక్రమంలో పునీత్ రాజ్ కుమార్ కుటుంబం పాల్గొననున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఇందులో భాగంగా పునీత్ భార్య అశ్విని పునీత్ తమ పిల్లలు సమాధి దగ్గరకు వచ్చి పూజలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర రాజ్‌కుమార్, శివ రాజ్‌కుమార్ సహా కుటుంబ సభ్యులు కూడా హాజరుకానున్నారు.
కన్నడ లెజెండరీ యాక్టర్ రాజ్ కుమార్ తనయుడుగా శాండల్ వుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పునీత్ రాజ్ కుమార్ తన టాలెంట్‌తో పవర్ స్టార్ అని పిలిపించుకున్నాడు. పునీత్ మంచి డ్యాన్సర్ కూడా కావడంతో ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే 2021 అక్టోబర్ 29న పునీత్ రాజ్ కుమార్ జిమ్‌లో వ్యాయమం చేస్తున్న సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూలారు. దీంతో ఆయన్ను బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్యం మరింత విషమించడంతో ఐసీయూలో చికిత్స అందించారు. ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. ఎన్ని చేసినా ప్రయోజనం లేకపోయింది. 46 ఏళ్ల కన్నడ పవర్ స్టార్ గుండెపోటుతో కన్నుమూసినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.
ఇక దీనిపై అన్నయ్య శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. పునీత్ జ్ఞాపకాలను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. “అప్పు ఇప్పుడు లేడని అంతా అంటున్నారు. కానీ మనల్ని వదిలి పూర్తిగా ఎక్కడికి వెళ్లిపోలేదని అనిపిస్తుంది. నిత్యం మాతోనే ఉంటున్నాడు అంటూ శివరాజ్ కుమార్ భావోద్వేగానికి గురయ్యారు.