‘ మాది చిన్న సినిమా. చిన్న రిలీజ్. ‘ఈగల్’తో పోటీపడే పెద్ద సినిమా కాదు. అయినా హంబుల్‌గా అందరికీ అమోదయోగ్యంగా ఉన్న నిర్ణయాన్ని తీసుకుని ఈ నెల 10న ‘ట్రూ లవర్’ని విడుదల చేస్తున్నాం’ అని యువ నిర్మాత ఎస్కేఎన్ చెప్పారు. ప్రతిరోజు పండగే, ట్యాక్సీవాలా, బేబీ చిత్రాలను ఆయన నిర్మించారు.
మణికందన్, శ్రీగౌరీప్రియ, కన్న రవి ప్రధాన పాత్రధారులుగా తమిళంలో రూపొంది, ఈ నెల 10న విడుదలకు సిద్ధంగా ఉన్న ‘ట్రూ లవర్’ అనే సినిమాను తెలుగులో అనువదించి, అదే తేదీలో విడుదల చేయనున్నారు ఎస్కేఎన్. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించారాయన. ‘ ఒక ఫ్రెండ్ ద్వారా ‘ట్రూ లవర్’ సినిమా మా దృష్టికి వచ్చింది.
మారుతీతో కలిసి ఈ సినిమా చూశాం. అద్భుతం అనిపించింది. తెరపై పాత్రలలో ప్రేక్షకులు తమకు తాము ఊహించుకునేంత గొప్ప కథ,కథనం ‘ట్రూ లవర్’ సొంతం. అందుకే తెలుగులో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. మా ‘బేబీ’తో ఈ సినిమాను పోల్చలేం. ప్రేమికులు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో సాగే కథ ‘ట్రూ లవర్’ ’ అని తెలిపారు ఎస్కేఎన్.
నిర్మాతగా స్ట్రయిట్ సినిమాలు చేయడమే తనకిష్టమని, మనసును హత్తుకునే అరుదైన సినిమాలు ఇతర భాషల్లో రావడంతో వాటిని తెలుగులో విడుదల చేయాలనే కోరిక పుట్టడం సహజమేనని, బంధాలకు నమ్మకమే పునాది అని తెలియజెప్పే కథాంశంతో దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, బన్నీ వాసు ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్నారని ఎస్కేఎన్ చెప్పారు. తాను నాలుగు సినిమాలు నిర్మించనున్నానని, వాటిలో మూడు ప్రేమకథలు కాగా, ఒకటి సైన్స్ ఫిక్షన్ కథాంశమని, అల్లు అర్జున్‌తో సినిమా నిర్మించడం తన ధ్యేయమని ఆయన తెలిపారు.