‘కేజీఎఫ్’ఫేం యష్ నటిస్తున్న పాన్ఇండియా సినిమా ‘టాక్సిక్’. ‘ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోస్-అప్స్’ అనేది ఉపశీర్షిక. భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్‌లో కూడా చిత్రీకరించబడుతున్న తొలి భారతీయ సినిమాగా ‘టాక్సిక్’ రికార్డులకెక్కింది. పలు అంతర్జాతీయ వేదికలపై అవార్డులు గెలుచుకున్న గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్, యష్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
విభిన్న భాషా, సాంస్కృతిక నేపథ్యాలతో రాబోతున్న ‘టాక్సిక్’ మూవీ అన్ని ప్రాంతాల ప్రేక్షకులూ ఆస్వాదించేలా ఉంటుందని, సాంస్కృతికంగా అన్ని సరిహద్దులను చెరిపేస్తుందని డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ తెలిపారు. ప్రపంచమంతా ప్రతిధ్వనించేలా ‘టాక్సిక్’ సినిమా ఉంటుందని, విశ్వవేదికపై భారతీయ సినిమాను కూడా ప్రదర్శించేలా టాక్సిక్ సినిమా రాబోతున్నదని నిర్మాత వెంకట్ కె.నారాయణ్ చెప్పారు.
హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘జాన్ విక్’ చిత్రానికి పనిచేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్ జేజే పెర్రీ ఈ సినిమాకు యాక్షన్ సీక్వెన్స్ సమకూరుస్తున్నారని, ఆ సీక్వెన్స్ ఆడియన్స్‌ని ఫిదా చేస్తాయని, ఇండియన్ హిస్టరీలో అత్యంత భారీ ఖర్చుతో నిర్మిస్తున్న సినిమాల్లో ‘టాక్సిక్’ ఒకటని మేకర్స్ చెబుతున్నారు. గత ఏడాది ఆగస్ట్ నుంచి ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్నది.