Eesha Movie | టాలీవుడ్లో చిన్న సినిమాలను టార్గెట్ చేస్తూ సాగుతున్న ‘పెయిడ్ నెగిటివ్ ప్రచారం’పై ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. త్రిగుణ్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో రూపొందిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’. ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈషాపై జరుగుతున్న ఉద్దేశపూర్వక నెగిటివ్ రివ్యూలపై చిత్ర నిర్మాతలు వంశీ నందిపాటి, దామోదర్ ప్రసాద్‌లతో కలిసి బన్నీ వాసు మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సినిమా రేటింగ్లను పడగొట్టడానికి ఒక పక్కా ప్లాన్ ప్రకారం నెగిటివ్ ప్రచారం సాగుతోందని బన్నీ వాసు ఆరోపించారు. 30 నుంచి 50 వేల రూపాయలు ఖర్చు చేసి ఒక సినిమా రేటింగ్‌ను దారుణంగా పడగొట్టే మాఫియా తయారైంది. ప్రీమియర్ షో సమయంలో ఎవరో ఒకరు 200 టిక్కెట్లు బుక్ చేసుకుంటారు. షో అవ్వగానే అందరూ కలిసి ‘1 రేటింగ్’ ఇస్తారు. దీనివల్ల బుక్ మై షోలో సినిమా రేటింగ్ ఒక్కసారిగా పడిపోతుంది. సాధారణ ప్రేక్షకులు సినిమా చూసి ఇచ్చే రేటింగ్ కోసం వేచి చూడాలి తప్ప, ఇలాంటి పెయిడ్ రేటింగ్లను నమ్మొద్దు అని బన్నీ వాసు కోరారు. ఫేక్ రివ్యూల ఇబ్బందులు తన జీవితంలో చాలాసార్లు చూశానని ఇప్పుడు ‘ఈషా’ చిత్ర నిర్మాతలు దీనిని ఎదుర్కొంటున్నారని అన్నారు. అందుకే వారు కాస్త ఆందోళన చెందుతున్నారని, తాను ఇవన్నీ దాటుకుని సాధువులా మారిపోయానని బన్నీ వాసు పేర్కొన్నాడు.
నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ.. సినిమా విడుదల కాకముందే నెగిటివ్ రిపోర్ట్స్ ఇస్తున్నారని మండిపడ్డారు. మా సినిమా ఇంకా అమెరికాలో రిలీజే కాలేదు, కానీ అక్కడ ఒక వ్యక్తి నెగిటివ్ రివ్యూ ఇచ్చేశాడు. అతడిని అడిగితే.. ఇండస్ట్రీలో ఎవరో చూసి చెబితే రాశానని అంటున్నాడు. ఎవరో చెప్పిన మాటలు విని పేరాల కొద్దీ నెగిటివ్ రివ్యూలు రాయడం ఎంతవరకు సబబు? ప్రీమియర్ షోలకు వస్తున్న స్పందన చూస్తుంటే ప్రేక్షకులు ఈ ఫేక్ ప్రచారాన్ని నమ్మడం లేదని అర్థమవుతోంది అని అన్నారు.
మరో నిర్మాత దామోదర్ ప్రసాద్ ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు మూడు గదుల్లో కంప్యూటర్లు పెట్టుకుని, కావాలని సినిమాలపై విషం చిమ్ముతున్నారు. మీ సినిమాలను మీరు ప్రమోట్ చేసుకోండి, కానీ పక్కా సినిమాలను తొక్కేయడం నీచమైన వ్యాపారం. నేను గనుక నోరు విప్పి అసలు నిజాలు మాట్లాడితే, ఇలా నెగిటివ్ ప్రచారం చేసే వారి కెరీర్ పరిశ్రమలో ముగిసిపోతుంది అని గట్టిగా హెచ్చరించారు.