Priyanka Chopra | గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ (Priyanka Chopra Jonas) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా హాలీవుడ్ చిత్రం ‘ది బ్లఫ్’ (The Bluff). ది బాయ్స్ (The Boys) వెబ్ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న కార్ల్ అర్బన్ (Karl Urban) ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో(PrimeVideo)లో ఫిబ్రవరి 25 నుంచి నేరుగా స్ట్రీమింగ్ కాబోతుండగా తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్లో ప్రియాంక గతంలో ఎన్నడూ చూడని విధంగా ‘బ్లడీ మేరీ’ అనే పవర్ఫుల్ పైరేట్ (సముద్రపు దొంగ) పాత్రలో ఊరమాస్ లుక్‌లో కనిపిస్తున్నారు.
కథ విషయానికి వస్తే.. 19వ శతాబ్దపు కరేబియన్ దీవుల నేపథ్యంలో సాగుతుంది. ఒకప్పుడు సముద్రపు దొంగగా హింసాత్మక జీవితాన్ని గడిపిన ఎర్సెల్ (ప్రియాంక), తన గతాన్ని వదిలేసి కుటుంబంతో ప్రశాంతంగా జీవిస్తుంటుంది. అయితే, ఆమె పాత శత్రువు కానర్ (కార్ల్ అర్బన్) రూపంలో ప్రమాదం ముంచుకొస్తుంది. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఆమె మళ్ళీ కత్తి పట్టి యుద్ధానికి ఎలా సిద్ధమైందనేదే ఈ సినిమా ప్రధాన కథ.
ట్రైలర్లో ప్రియాంక చేసిన యాక్షన్ సీక్వెన్స్, కత్తి యుద్ధాలు మరియు ఎమోషనల్ సీన్స్ హైలైట్‌గా నిలిచాయి. హాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు ‘రూసో బ్రదర్స్’ (Russo Brothers) నిర్మాణంలో ఫ్రాంక్ ఇ. ఫ్లవర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరోవైపు ప్రస్తుతం ప్రియాంక చోప్రా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న ‘వారణాసి’ (SSMB29) చిత్రంలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.