Prithviraj Sukumaran Injured | ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాలకు అన్ని భాషల ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ వస్తుంది. తెలిసిన కథలనే కొత్తగా, ఎలాంటి భారీ హంగులకు పోకుండా, ఎంటర్టైనింగ్గా చూపించడంలో మలయాళ మేకర్స్ దిట్ట. ముఖ్యంగా పృథ్విరాజ్ సుకుమార్ సినిమాలకు ఇక్కడ మంచి గిరాకీ ఉంది. ఆయన సినిమాలను జల్లెడ పట్టి మరీ వెతికి చూస్తున్నారు. అయ్యప్పనుమ్ కోషియమ్, జనగణమన, కడువ వంటి సినిమాలతో పృథ్వి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయాడు. ఇక ప్రభాస్ సలార్‌లోనూ కీలకపాత్ర పోషిస్తుండటంతో ఇక్కడ మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా పృథ్విరాజ్ ప్రమాదానికి గురైయ్యాడు.
ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘విలాయత్ బుద్ద’ షూటింగ్లో పృథ్విరాజ్ గాయాలపాలైయ్యాడు. బస్సులో ఓ ఫైట్ సీన్ చేస్తున్న సమయంలో పృథ్వీరాజ్ జారిపడ్డారు. దాంతో ఆయన కాలికి గాయమైంది. గాయం ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆయన్ని వెంటనే కేరళలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. సోమవారం ఆయనకు సర్జరీ కూడా చేయనున్నారు. దాంతో పృథ్వి కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జయన్ నంబియార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేశాడు.