Prashanth Varma | తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న హనుమాన్ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ముఖ్యంగా సంక్రాంతికి స్టార్ హీరోలు అంతా కట్టగట్టుకుని వస్తున్నా కూడా తన సినిమాను మాత్రం వెనక్కి తగ్గించే ప్రసక్తే లేదంటున్నాడు ప్రశాంత్ శర్మ. ఈ చిత్రంపై అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. నైజాం ఏరియా వరకు మాత్రమే మైత్రి మూవీ మేకర్స్ ఏకంగా 7.5 కోట్లు ఇచ్చారంటే సినిమాపై ఉన్న అంచనాలేంటో అర్థమవుతుంది. అలాగే ఆంధ్రా, సీడెడ్‌లో సైతం అదిరిపోయే రేట్లు పలుకుతున్నాయి హనుమాన్ సినిమాకు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ కచ్చితంగా 20 కోట్లు టచ్ అయ్యేలా కనిపిస్తుంది. పండక్కి గుంటూరు కారం, ఈగల్, సైంధవ్, నా సామిరంగా లాంటి సినిమాలు పోటీలో ఉన్నా కూడా హనుమాన్కు ఈ రేంజ్ బిజినెస్ చేస్తున్నారంటే నమ్మకం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తమ సినిమా ఔట్ పుట్ అదిరిపోయింది కాబట్టే దర్శక నిర్మాతలు కూడా అంతే కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. తమ సినిమాను ఎవరు వాయిదా వేసుకొమ్మని చెప్పినా కూడా నో వే అంటున్నారు వాళ్లు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ కోసం ఏకంగా స్టార్ హీరోలను రంగంలోకి దించుతున్నాడు ప్రశాంత్ వర్మ . టాలీవుడ్లో తనకు ఉన్న పరిచయాలు హనుమాన్ కోసం వాడుకుంటున్నారు. ఆర్నెల్ల కింద ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ కోసం ప్రశాంత్ వర్మ పని చేశాడు. ఆ ఈవెంట్ మొత్తాన్ని డైరెక్ట్ చేశాడు ఈయన. ప్రభాస్‌తో అప్పుడు ప్రశాంత్‌కు బాగానే పరిచయం ఏర్పడింది. దాన్నిప్పుడు తన సినిమా కోసం వాడుకుంటున్నాడు. జనవరి 7న ప్రీ రిలీజ్ వేడుక ప్లాన్ చేస్తున్నారు. దానికి ప్రభాస్‌ను ముఖ్య అతిథిగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్.
తన సినిమాకు పని చేశాడు కాబట్టి కచ్చితంగా ప్రభాస్ నో చెప్పే ఛాన్సే లేదు. మరోవైపు అన్‌స్టాపబుల్ ఈవెంట్ ప్రోమోను కూడా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశాడు. అలా బాలయ్యతోనూ ఈయనకు మంచి పరిచయమే ఉంది. ఇప్పుడు దాన్ని కూడా తన సినిమా కోసం వాడేస్తున్నాడు. నీ సినిమాకు ఏం చేయాలో చెప్పరా.. నేను చేసి పెడతాను అంటూ బాలయ్య మాటిచ్చినట్లు చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ. అంతేకాదు చిరంజీవి దగ్గరికి కూడా వెళ్తున్నారు హనుమాన్ మేకర్స్. అసలే అక్కడున్నది అంజనీ పుత్రుడు.. ఇక ఆయన హనుమాన్ సినిమాకు సాయం చేయమంటే నో చెప్తాడా చెప్పండి..? ఈ లెక్కన టాలీవుడ్ టాప్ హీరోలలో చాలా మందిని కదిలిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. జనవరి 12న విడుదల కానుంది హనుమాన్ సినిమా.