‘లవ్‌టుడే’ సినిమాతో అటు దర్శకునిగా, ఇటు హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు నటదర్శకుడు ప్రదీప్ రంగనాథన్. ‘డ్రాగన్’ విజయంతో తెలుగు నిర్మాతలు సైతం ఈయన డేట్స్ కోసం క్యూ కడుతున్న పరిస్థితి. ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ హీరోగా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ పేరుతో అగ్ర నటి నయనతార ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నది.
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేకర్స్ ఆయనతో ‘డ్యూడ్’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ‘లవ్‌టుడే’తో దర్శకుడిగా కూడా సక్సెస్ అయినా.. హీరోగానే అవకాశాలు వరిస్తున్న నేపథ్యంలో.. ఇక ప్రదీప్ రంగనాథన్ మెగా ఫోన్ పట్టడం కష్టం అని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలనూ తారుమారు చేస్తూ త్వరలో ఆయన మెగా ఫోన్ పట్టనున్నారు.
ఇప్పటికే స్క్రిప్ట్ కూడా సిద్ధమైందట. అయితే.. ఈ సారి గత చిత్రాలకు భిన్నంగా సైన్స్ ఫిక్షన్ కథతో రానున్నారట ప్రదీప్ రంగనాథన్. అలాగని ఇది భారీ బడ్జెట్ చిత్రం కాదని, కథ పరంగా సైన్స్ ఫిక్షనే అయినా.. తన మార్క్ సెన్సిబిలిటీస్‌తో సాధారణ బడ్జెట్లోనే సినిమా ఉంటుందని తెలుస్తున్నది. ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్లు పూర్తయ్యాక ప్రదీప్ ఈ సినిమాను లైన్లో పెడతారట. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సివుంది.